అక్షరటుడే, వెబ్డెస్క్: CBSE | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) (Central Board of Secondary Education) పరీక్షల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. పదో తరగతి, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో బోర్డు మార్పులు మార్పు చేసింది. పరిపాలనాత్మక కారణాల వల్ల మార్చి 3న నిర్వహించాల్సిన పరీక్షలను కొత్త తేదీలకు మార్చినట్లు ప్రకటించింది.
CBSE | మార్చి 11వ తేదీకి మార్పు
గత షెడ్యూల్ (schedule) ప్రకారం.. మార్చి 3న పదో తరగతి విద్యార్థులకు టిబెటన్, జర్మన్, జపనీస్, స్పానిష్, కశ్మీరీ, మిజో, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, ఎలిమెంట్స్ ఆఫ్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటెన్సీ వంటి వివిధ భాషలు మరియు సబ్జెక్టుల పరీక్షలు జరగాల్సి ఉంది. కాగా.. ఈ పరీక్షలను మార్చి 11వ తేదీకి మార్చారు. అదేవిధంగా 12వ తరగతి విద్యార్థులకు అదే తేదీన నిర్వహించాల్సిన లీగల్ స్టడీస్ పరీక్షను ఏప్రిల్ 10వ తేదీకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
CBSE | ఫిబ్రవరి 17 నుంచి పరీక్షలు
ఈ మార్పు కేవలం మార్చి 3వ తేదీకి సంబంధించిన పరీక్షలకు మాత్రమే పరిమితమైందని బోర్డు స్పష్టం చేసింది. మిగతా పరీక్షలు మునుపటి ప్రకటన ప్రకారమే జరుగుతాయని పేర్కొంది. కాగా.. సీబీఎస్ఈ పరీక్షలు (CBSE exams) ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
విద్యార్థుల సన్నద్ధతలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ సమాచారాన్ని వీలైనంత త్వరగా విద్యార్థులకు తెలియజేయాలని పాఠశాల ప్రిన్సిపాళ్లను బోర్డు ఆదేశించింది. కొత్త తేదీలను గమనించి.. విద్యార్థులు తమ అధ్యయన ప్రణాళికను అందుకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించింది.