అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kaleshwaram project | కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను వెలికి తీసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గురువారం నుంచి దర్యాప్తును ప్రారంభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై నిగ్గు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
20 రోజుల తర్వాత రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ అధికారులు (investigation agency officials) గురువారం నుంచి విచారణ ప్రారంభించారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీతో (ఎన్డీఎస్ఏ) పాటు పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission) ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రాథమిక విచారణ మొదలు పెట్టారు. కీలక ఫైళ్లను పరిశీలిస్తున్నారు. వీటి ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి దర్యాప్తును చేపట్టనున్నారు.
Kaleshwaram project | కాళేశ్వరంలో భారీగా అవినీతి
బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిపోయింది. కాళేశ్వరంలో గుండెకాయ వంటి మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగి పగుళ్లు వచ్చాయి. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచే ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. దానికి తోడు కట్టిన మూడేళ్లకు మేడిగడ్డ కుంగడంతో ఆయా ఆరోపణలకు బలం చేకూర్చినట్లయింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాళేశ్వరం అక్రమాలపై విచారణకు ఆదేశించింది. విజిలెన్స్, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (National Dam Safety Authority), పీసీ ఘోష్ కమిషన్‌ను రంగంలోకి దింపి విచారణ చేయించింది. ఈ క్రమంలో భారీగా అవినీతి ఆరోపణలు బయటపడ్డాయి.
Kaleshwaram project | అనేక అవకతవకలు..
విజిలెన్స్‌తో పాటు పీసీ ఘోష్ కమిషన్ విచారణలో కాళేశ్వరంలో జరిగిన అక్రమాలు బయటపడ్డాయి. ప్రాజెక్టులో అనేక లోపాలున్నాయని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని వెల్లడించింది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నిర్మాణం జరిగిందని, మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే మూడు బ్యారేజీలలో భారీగా డ్యామేజ్ జరిగిందని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా బ్యారేజీ నిర్మాణాలకు బడ్జెట్ విడుదల అయిందని నిర్ధారించింది.
సరైన ప్రణాళిక లేకుండా మేడిగడ్డ నిర్మాణం చేపట్టారని, మేడిగడ్డ నిర్మాణం కోసం నిపుణుల కమిటీ సిఫార్సు చేయకపోయినా అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాలతో మేడిగడ్డ బరాజ్ (Medigadda Barrage) నిర్మాణం జరిగిందని తేల్చింది. భద్రతా ప్రమాణాలను పాటించలేదని, పనుల పర్యవేక్షణలో లోపాలున్నాయని వెల్లడించింది. ప్రాజెక్ట్ నిర్మాణం అంచనాలు పెంచి ప్రజాధనం దుర్వినియోగం చేశారని, ప్రాజెక్టు ఖర్చు రూ.38,500 కోట్ల నుంచి రూ.1.10 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొంది. కేంద్ర జల సంఘం సూచనలు పట్టించుకోలేదని, రాజకీయ జోక్యం, పరిపాలనా నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్ట్ దెబ్బతిన్నట్టు వెల్లడించింది.
Kaleshwaram project | సీబీఐ విచారణకు ఆదేశం..
కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి కేసును అప్పగించింది. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ శాసనసభ (Telangana Legislative Assembly) తీర్మానం చేసింది. కాళేశ్వరం అవకతవకలపై అసెంబ్లీలో సుదీర్ఘ విచారణ చేపట్టిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. కాళేశ్వరం పేరుతో దోచుకున్నవాళ్లందరికీ శిక్షపడాలన్నారు.
నిజాయితీగా నిష్పక్షపాతంగా విచారణ జరగాలనే కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తున్నట్టు ప్రకటించారు సీఎం. జస్టిస్ పీసీ కమిషన్.. అలాగే NDSA, ఇతర ఏజెన్సీలు.. క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించినందువల్లే కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు చెప్పారు. కాళేశ్వరంపై దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం సెప్టెంబర్ 2న సీబీఐకి లేఖ రాసింది.
Kaleshwaram project | కేసీఆర్‌ను ప్రశ్నించే అవకాశం..
ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగిన సీబీఐ విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, పీసీ ఘోష్ కమిషన్ నివేదికలను అధ్యయనం చేస్తోంది. కీలక ఫైళ్లను పరిశీలిస్తోంది. వాటి సారాంశం ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదుచేసి, దర్యాప్తు చేపట్టనుంది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన వారందరినీ కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రశ్నించనుంది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ సహా ఇరిగేషన్, ఫైనాన్స్, ఇంజినీరింగ్ అధికారులను విచారించే అవకాశముంది.