అక్షరటుడే, వెబ్‌డెస్క్: CBI | అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Former Governor Satya Pal Malik)పై సీబీఐ(CBI) గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది.
కిరు జలవిద్యుత్ ప్రాజెక్టు(Kiru Hydroelectric Project) కేసులో రూ.2,200 కోట్ల సివిల్ పనుల మంజూరులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మాలిక్‌తో పాటు మరో ఐదుగురిపై కేంద్ర దర్యాప్తు సంస్థ చార్జిషీట్ దాఖలు చేసింది. మూడు సంవత్సరాల దర్యాప్తు తర్వాత ఈ చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. మాలిక్ మరియు మరో ఐదుగురిని నిందితులుగా పేర్కొంది.
గతేడాది ఫిబ్రవరిలో ఈ కేసుకు సంబంధించి మాలిక్, ఇతరుల ప్రాంగణంలో సీబీఐ సోదాలు(CBI searches) నిర్వహించింది. 2019లో ఓ ప్రైవేట్ కంపెనీకి కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్(హెచ్ఈపీ) ప్రాజెక్ట్ సుమారు రూ.2,200 కోట్ల విలువైన సివిల్ పనుల కాంట్రాక్టును అప్పగించడంలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ సీబీఐ 2022లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా ఆగస్టు 23, 2018 నుంచి అక్టోబర్ 30, 2019 వరకు పనిచేసిన మాలిక్.. ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్‌తో సహా రెండు ఫైళ్లను క్లియర్ చేయడానికి రూ.300 కోట్ల లంచం తీసుకున్నారని ఆరోపించింది.
CBI | అనారోగ్యంతో ఉన్నానన్న మాలిక్..
మరోవైపు, తాను అనారోగ్యంతో ఉన్నానని, ఇప్పుడు ఎవరితో మాట్లాడలేని స్థితిలో ఉన్నానని మాలిక్ ‘X’లో పోస్ట్ చేశారు. తనకు చాలా మంది శ్రేయోభిలాషుల నుంచి కాల్స్ వస్తున్నాయని, వాటిని తాను స్వీకరించలేకపోయానని వెల్లడించారు. గత సంవత్సరం ఏజెన్సీ సోదాలు నిర్వహించిన తర్వాత తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఆయన ఖండించారు. తాను ఫిర్యాదు చేసిన వ్యక్తులను, అవినీతిలో పాల్గొన్న వారిని విచారించడానికి బదులుగా తన నివాసంపై సీబీఐ దాడి చేసిందని మాలిక్ చెప్పారు.