అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirumala | తిరుమల శ్రీవారి దర్శనానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ప్రపంచవ్యాప్తంగా వేంకటేశ్వర స్వామి భక్తులు తిరుమలను దర్శించుకుంటారు. నిత్యం వేలాది మంది భక్తుల రాకతో తిరుమల క్షేత్రం కళకళలాడుతూ ఉంటుంది. భక్తులు తిరుమల క్షేత్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే కొందరు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి వారికి టీటీడీ (TTD) వార్నింగ్ ఇచ్చింది.
కొంతమంది తిరుమల శ్రీవారి ఆలయం ముందు రీల్స్ (Reels) తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తిరుమల మాఢ వీధుల్లో డ్యాన్సులు చేస్తూ రీల్స్ చేస్తున్నారు. దీంతో భక్తుల టీటీడీ చర్యలు చేపట్టింది. శ్రీవారి ఆలయం ముందు, మాఢ వీధుల్లో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాంటి వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపడతామని పేర్కొంది. భక్తులు ఆలయ నియమాలను పాటించి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడాలని కోరింది. క్షేత్ర పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేసింది.