అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLA Kaushik Reddy | హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (MLA Padi Kaushik Reddy)పై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా మంగళవారం ఆయన హల్చల్ చేశారు. యూసుఫ్‌గూడలో మహమ్మద్ ఫంక్షన్ హాల్‌లోకి చొచ్చుకొని వెళ్లారు.
పోలీసులు వద్దని చెప్పినా వినకుండా అనుచరులతో కలిసి కౌశిక్‌రెడ్డి ఫంక్షన్ హాల్‌లోకి వెళ్లారు. దీంతో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు (Jubilee Hills by-Elections) రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ జరిగింది. ఈ నేపథ్యంలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారికి పోలీసులు మద్దతు తెలుపుతున్నారని కౌశిక్ రెడ్డి మంగళవారం నిరసన తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ (BRS) యూసఫ్‌గూడ ఇన్ఛార్జిగా నియమించింది. ఈ క్రమంలో ఆయన హల్చల్ చేయడం గమనార్హం. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామిక పద్ధతుల్లో గెలవలేని కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయనను మంగళవారం అరెస్ట్ చేసి అక్కడి నుంచి పోలీసులు తరలించారు. తాజాగా బుధవారం కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.
