అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chandrahas Issue | తెలుగు యువ హీరో చంద్రహాస్‌పై మాదాపూర్ పోలీసులు (Madhapur Police) కేసు నమోదు చేశారు. జర్నలిస్టు అశోక్ వేములపల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. బుల్లితెర నటుడు ప్రభాకర్ (Actor Prabhakar) కుమారుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన చంద్రహాస్ ఇటీవల తన కొత్త సినిమా బరాబర్ ప్రేమిస్తా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాడిన పాటతో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
సినిమా ఈవెంట్లో చంద్రహాస్ పాడిన పాటలో అభ్యంతరకర పదజాలం ఉందంటూ సోషల్ మీడియా (Social Media)లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు నెటిజన్లు, సినీ వర్గాలు ఆయన ప్రవర్తనను తప్పుబట్టడమే కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Chandrahas Issue | క్షమాపణ చెప్పాలి..
ఈ నేపథ్యంలో జర్నలిస్టు అశోక్ వేములపల్లి (Journalist Ashok Vemulapalli) కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేస్తూ ఆ పాటపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “సినిమా పబ్లిసిటీ కోసం నెగెటివ్ పబ్లిసిటీ దాకా వెళ్లడం సరైంది కాదు. ఇలాంటి భాషను ప్రోత్సహించాలా?” అంటూ ప్రశ్నించారు. అదే సమయంలో ఈవెంట్‌కు హాజరైన వారిపైనా విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై చంద్రహాస్ ఘాటుగా స్పందించారు. స్టేజిపై ఆ పాట పాడినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మూడు నిమిషాల పాటలో కేవలం కొన్ని సెకన్లను కట్ చేసి బూతులుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ ఎవరికీ అవమానకరంగా ప్రవర్తించలేదని, ఆ పాట పాడిన తర్వాత చాలామంది అభినందించారని తెలిపారు.
అంతేకాకుండా అశోక్ వేములపల్లికి 24 గంటల గడువు ఇస్తున్నానని, క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చంద్రహాస్ హెచ్చరించారు. లాయర్లతో మాట్లాడుతున్నానని, ఈ విషయాన్ని వదిలిపెట్టబోనని పేర్కొన్నారు. ఈ పరస్పర విమర్శలు, హెచ్చరికల నేపథ్యంలో అశోక్ వేములపల్లి పోలీసులను ఆశ్రయించడంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్ (Madhapur Police Station)లో చంద్రహాస్‌పై కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.