అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tsunami | అమెరికా పశ్చిమ తీరానికి గణనీయమైన ప్రకృతి విపత్తు ముప్పుగా మారే అవకాశమున్నట్లు వర్జీనియా టెక్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఉత్తర కాలిఫోర్నియా నుండి బ్రిటిష్ కొలంబియా వరకూ విస్తరించిన కాస్కేడియా విభజన మండలిలో సంభవించే భారీ భూకంపం ఫలితంగా, 1000 అడుగుల ఎత్తయిన ‘మెగా సునామీ’ (Mega Tsunami) వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. కొన్ని విశ్లేషణల ప్రకారం.. కాస్కేడియా మండలిలో వచ్చే 50 సంవత్సరాల్లో 8.0 తీవ్రత గల భూకంపం సంభవించే అవకాశం 15 శాతం ఉందని అంటున్నారు. అటువంటి భూకంపం తీర ప్రాంత భూమిని 6.5 అడుగుల వరకూ కదిలించే ప్రమాదం ఉంది. ఇది సముద్ర అలలను రెచ్చగొట్టి, భారీ సునామీ సృష్టించగలదని శాస్త్రవేత్తలు (Scientists) హెచ్చరిస్తున్నారు.
Tsunami | మెగా సునామి రాబోతుందా..
వర్జీనియా టెక్ భూగర్భశాస్త్ర విభాగానికి చెందిన సహాయ ప్రొఫెసర్ టినా దురా (Professor Tina Dura) మాట్లాడుతూ.. “కాస్కేడియా భూకంపం (Cascadia Earthquake) తర్వాత తీర ప్రాంత భూభాగం ఎలా మారుతుందన్న అంశాన్ని ఇప్పటివరకు శాస్త్రీయంగా విశ్లేషించలేదు. కానీ ఇది భూ వినియోగం, నిర్మాణ భద్రతలపై గణనీయమైన ప్రభావాన్ని చూపగలదు” కాస్కేడియా విభజన మండలిని “The Big One” అనే పేరు వెంటాడుతోంది. ఇది అమెరికాలో ఒక పెండింగ్‌లో ఉన్న అత్యంత ప్రమాదకరమైన భూకంప ప్రాంతంగా పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ‘మెగా సునామీ’ కారణంగా దక్షిణ వాషింగ్టన్, ఉత్తర ఒరెగాన్, ఉత్తర కాలిఫోర్నియా (Northern California) ప్రాంతాలు అత్యంత ప్రభావితమవుతాయని అధ్యయనం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా సీటల్, పోర్ట్‌ల్యాండ్ వంటి నగరాలు తీవ్ర విధ్వంసానికి లోనయ్యే ప్రమాదం ఉంది. అలాస్కా, హవాయి ద్వీపాలు కూడా ఈ ప్రభావానికి మినహాయించబడవు.
సాధారణ సునామీలతో పోల్చితే, ‘మెగా సునామీ’లు నిమిషాల వ్యవధిలోనే తీరాన్ని తాకగలవు. అలలు వందల అడుగుల ఎత్తులో, మైళ్ల దూరం లోపలికి చొచ్చుకు వెళ్లగలవు. అటువంటి వేగవంతమైన విపత్తుల ముందస్తు హెచ్చరికలు చాలవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (FEMA) అంచనాల ప్రకారం, అలాంటి విపత్తు కారణంగా 13,000 పైగా మరణాలు, 27,000 మందికి పైగా గాయాలు, లక్షల మందికి అనాధలు అయ్యే అవకాశాలున్నాయి. రహదారులు, విమానాశ్రయాలు, నీటి శుద్ధి కేంద్రాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని సూచించింది. 1958లో అలాస్కాలో లిటుయా బేలో 1,719 అడుగుల ఎత్తు సునామీ సంభవించింది. అది ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ఎత్తు సునామీగా గుర్తింపు పొందింది. అదే విధంగా, హవాయిలోని లానాయ్ ద్వీపానికి తాకిన పూర్వకాల సునామీలలో కూడా 1000 అడుగుల ఎత్తు అలలు నమోదయ్యాయి.