HomeUncategorizedCargo Ship | నీట మునిగిన కార్గో షిప్‌.. స‌ముద్రం పాలైన మూడు వేల కార్లు

Cargo Ship | నీట మునిగిన కార్గో షిప్‌.. స‌ముద్రం పాలైన మూడు వేల కార్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cargo Ship | ఉత్త‌ర పసిఫిక్ మ‌హా స‌ముద్రంలో ఓ కార్గో షిప్ నీట మునిగింది. మూడు వేల కార్ల‌తో మెక్సికో(Mexico)కు బ‌య‌ల్దేరిన ర‌వాణా నౌక మార్నింగ్ మిడాస్ మునిగి పోయింది. కొన్ని వారాల క్రితం ఈ నౌక‌లో మంట‌లు చెల‌రేగడంతో సిబ్బంది ఈ నౌకను వ‌దిలిపెట్టి సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డ్డారు. తాజాగా ఈ కార్గో షిప్(Cargo Ship) అల‌స్కాలోని అలూటియ‌న్ వ‌ద్ద మునిగి పోయింద‌ని లండ‌న్‌కు చెందిన ఓడ నిర్వ‌హ‌ణ సంస్థ జోడియాక్ మారిటైమ్ తెలిపింది. అయితే, నౌక మునిగి పోయిన అనంత‌రం అంత పెద్ద‌గా కాలుష్యం వెలువ‌డ‌లేద‌ని అలాస్కాకు చెందిన యూఎస్ కోస్ట్ గార్డ్(US Coast Guard) ప్రతినిధి పెట్టీ ఆఫీసర్ కామెరాన్ స్నెల్ తెలిపారు. కాలుష్య నియంత్ర‌ణ ప‌రిక‌రాలు క‌లిగిన రెండు సాల్వేజ్ ట‌ల్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ప్ర‌తికూల వాతావరణానికి తోడు అగ్నిప్రమాదం కారణంగా ఈ కార్గో షిప్ 16,404 అడుగుల (5,000 మీటర్లు) లోతులో భూమి నుంచి 415 మైళ్ల‌ (770 కిలోమీటర్లు) దూరంలో నీటిలో మునిగిపోయిందని పేర్కొన్నారు.

Cargo Ship | స‌ముద్ర గ‌ర్భంలోకి మూడు వేల కార్లు

దాదాపు 3 వేల కార్ల‌(3 Thousand Cars)తో మార్నింగ్ మిడాస్ అనే కార్గో నౌక మే 26న చైనాలోని యాంటై నుంచి మెక్సికోకు బ‌య‌ల్దేరింది. అయితే, అడాక్ ద్వీపానికి నైరుతి దిశలో 300 మైళ్లు (490 కిలోమీటర్లు) దూరంలో ఉన్న స‌మ‌యంలో జూన్ 3న ఈ ర‌వాణా నౌక‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు US కోస్ట్ గార్డ్ తెలిపింది. ఈ నౌక‌లో మూడు వేల కార్లు ఉండ‌గా, అందులో దాదాపు 800 ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు(800 Electric Vehicles) ఉన్నాయి. అందులోనే తొలుత మంట‌లు వ్యాపించాయ‌ని కోస్ట్‌గార్డు తెలిపింది. అప్పటికే ప్ర‌తికూల వాతావ‌ర‌ణానికి తోడు నీటి ప్ర‌వాహం వ‌ల్ల నౌక‌లో మంట‌లు చెల‌రేగాయి. ఆ స‌మ‌యంలో అందులో 22 మంది సిబ్బంది ఉన్నారు. వారందరూ లైఫ్‌బోట్(Lifeboat) ద్వారా సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో స‌మీపంలోని మ‌ర్చంట్ మెరైన్ అనే మ‌రో నౌక వారిని ర‌క్షించింది. దాదాపు 20 రోజుల త‌ర్వాత కార్గో నౌక కార్ల‌తో స‌హా నీట మునిగి పోయింది.