అక్షరటుడే, వెబ్డెస్క్: Car Showroom Fire Hyderabad | హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్లో ఓ కార్ల షో రూమ్లో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.
అత్తాపూర్లోని పిల్లర్ నంబర్.185 సమీపంలోని సుజుకి షోరూమ్ సర్వీస్ సెంటర్ (Suzuki Showroom Service Center)లో అగ్నిప్రమాదం జరిగింది. స్క్రాప్గోడౌన్లో మంటలు చెలరేగడంతో మూడు కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో అధికారులు ముందు జాగ్రత్తగా సమీపంలోని కుటుంబాలను ఖాళీ చేయించారు.
Car Showroom Fire Hyderabad | నిర్లక్ష్యంతో..
ప్రమాద సమయంలో షో రూమ్లో సుమారు 70 కార్లు ఉన్నాయి. మంటలు రావడాన్ని గమనించి స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. షో రూమ్ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేస్ట్ ఆయిల్స్, బ్యాటరీలు అన్నీ కలిపి ఒకే దగ్గర పెట్టడంతో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. కాగా ఉద్దేశపూర్వకంగా ఎవరో నిప్పు అంటించారని షో రూమ్ నిర్వాహకులు (Showroom Managers) ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Car Showroom Fire Hyderabad | వరుస ప్రమాదాలు
హైదరాబాద్ నగరంలో ఇటీవల వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో మంటలు అంటుకొని ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇటీవల నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో సైతం అగ్ని ప్రమాదం జరిగింది. రానున్నది ఎండాకాలం కావడంతో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.