అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | నూతన సంవత్సర (New Year) వేళ విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా (Kamareddy district) కేంద్రంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
Kamareddy | ఏడాదిన్నర కిందటే వివాహం..
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రామారెడ్డి మండలం (Ramareddy mandal) రెడ్డిపేట గ్రామానికి చెందిన గోపు నరేష్ (30) కామారెడ్డి పట్టణంలో నివాసం ఉంటున్నాడు. నరేష్‌కు ఏడాదిన్నర క్రితమే ప్రస్తుత భిక్కనూరు సర్పంచ్ కూతురితో వివాహం జరిగింది. అయితే నరేష్ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో (Hyderabad) ఉంటున్నట్టుగా తెలుస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా కామారెడ్డికి వచ్చిన నరేష్ గుమస్తా కాలనీ నుంచి ఇంటికి వెళ్తుండగా కలెక్టరేట్ సమీపంలోని జయశంకర్ కాలనీ వద్దకు రాగానే కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Kamareddy | స్టీరింగ్ పనిచేయకపోవడమే కారణమా..?
ప్రమాదం జరిగిన సమయంలో కారులో నరేష్ ఒక్కడే ఉన్నాడు. అయితే గత కొద్దిరోజులుగా నరేష్ కారు స్టీరింగ్ సరిగా పని చేయడం లేదని సమాచారం. రెండు నెలల క్రితం స్టీరింగ్ రిపేర్ చేయించినా సరిగా చేయకపోవడం వల్ల గురువారం స్టీరింగ్ గట్టిగా పట్టుకోవడం వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.