అక్షరటుడే, బాల్కొండ: police arrested accused | మండలంలో పోలీసులు (Balkonda Police) గంజాయి గ్యాంగ్ గుట్టురట్టు చేశారు. ఈ మేరకు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) శుక్రవారం వివరాలు వెల్లడించారు.
police arrested accused | బాల్కొండ జూనియర్ కళాశాల సమీపంలో..
బాల్కొండ జూనియర్ కళాశాల (Balkonda Junior College) సమీపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. ఈ ప్రాంతంలో గంజాయి విక్రయానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 1.2 కిలోల గంజాయి, 6 మొబైల్ ఫోన్లు, బైక్ ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.30వేలు ఉంటుందని సీపీ తెలిపారు. నిందితులు మహమ్మద్ అమ్జత్ అలీ (పెర్కిట్), మహమ్మద్ నయీం (పెర్కిట్), ఆద్నాన్ (ఆర్మూర్), చిల్వేరు మనోజ్ కుమార్ (కిసాన్‌నగర్), జక్కుల గోవింద్ (బాల్కొండ), ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మరో నలుగురు వ్యక్తులు మున్ని (కిన్వట్), వహీద్ సుల్తాన్, సోఫియాన్, మోసిన్ (ఆర్మూర్) పరారీలో సీపీ వెల్లడించారు.
మహారాష్ట్రలోని కిన్వట్ నుంచి..
గంజాయి విక్రయంలో ప్రధాన నిందితుడు అమ్జత్ అలీ మహారాష్ట్రలోని (Maharashtra) కిన్వట్ ప్రాంతం నుంచి కిలోకు సుమారు రూ.20 వేల చొప్పున గంజాయి కొనుగోలు చేసేవాడని సీపీ తెలిపారు. అక్కడి నుంచి తీసుకొచ్చి బాల్కొండ, పెర్కిట్, ఆర్మూర్ ప్రాంతాల్లో చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని సీపీ తెలిపారు. 5 గ్రాముల ప్యాకెట్లను రూ.400–500లకు విక్రయిస్తూ, ఒక్కో ప్యాకెట్‌పై రూ.100 కమిషన్ విధానంలో ఇతర నిందితులను ఏజెంట్లుగా ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువతను లక్ష్యంగా చేసుకుని మొబైల్ ఫోన్ల ద్వారా ఆర్డర్లు తీసుకుని సరఫరా చేస్తున్నట్లు తెలిసిందన్నారు. గంజాయి విక్రయంలో బాలుడిని ఉపయోగించినందుకు జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. మిగతా నిందితులను రిమాండ్‌కు తరలిస్తామని తెలిపారు.
పోలీసులకు ప్రశంసలు
ఈ కేసును ఛేదించడంలో ముఖ్యపాత్ర పోషించిన ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి (Armoor Rural CI John Reddy), బాల్కొండ ఎస్సై శైలేందర్, కానిస్టేబుళ్లు శంకర్, భారత్ గౌడ్, హోంగార్డ్ నవీన్‌లను నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య అభినందించారు.