Homeతాజావార్తలుEdupayala Temple | శాంతించిన మంజీర.. ఏడుపాయల ఆలయాన్ని వీడిన వరద

Edupayala Temple | శాంతించిన మంజీర.. ఏడుపాయల ఆలయాన్ని వీడిన వరద

మెదక్ జిల్లాలోని ఏడుపాయల క్షేత్రంలో మంజీర నది శాంతించింది. దీంతో దుర్గామాత ఆలయం వరద నుంచి బయట పడింది.

- Advertisement -

అక్షరటుడే, మెదక్​ : Edupayala Temple | ఎగువన వర్షాలు తగ్గడంతో మంజీర నది శాంతించింది. సింగూరుకు ఇన్​ఫ్లో (Singuru Inflow) తగ్గడంతో అధికారులు దిగువకు నీటి విడుదలను తగ్గించారు. దీంతో మెదక్​ జిల్లా (Medak District) పాపన్నపేట మండలంలోని ఏడుపాయల క్షేత్రంలో వరద ఉధృతి తగ్గింది.

ఈ ఏడాది మంజీరకు వరద పోటెత్తడంతో దాదాపు 50 రోజుల దుర్గామాత ఆలయం మూసి ఉంది. ఆలయాన్ని తాకుతూ వరద ప్రవహిస్తుండటంతో అధికారులు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి రాజగోపురంలో పూజలు చేస్తున్నారు. ఆగస్టు 14 నుంచి ఆలయానికి తాళం వేసి ఉంది. దీంతో అప్పటి నుంచి భక్తులు రాజగోపురంలోనే దుర్గామాతను (Durgamatha) దర్శించుకుంటున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు సైతం రాజగోపురంలోనే నిర్వహించారు.

Edupayala Temple | తీవ్ర నష్టం..

సింగూరు నుంచి ఇటీవల లక్ష క్యూసెక్కులకు పైగా దిగువకు విడుదల చేశారు. దీంతో ఏడుపాయల క్షేత్రంలో మంజీర (Manjeera) ఉగ్రరూపం దాల్చింది. ఆలయం ముందు షెడ్డును తాకూతు వరద ప్రవహించింది. ఆలయం సమీపంలోని ప్రసాదాల షెడ్డు వరదలో కొట్టుకుపోయింది. అంతేగాకుండా ఆలయంలోని క్యూలైన్​ గ్రిడ్లు ధ్వంసం అయ్యాయి.

గోడలు కూలిపోయాయి. పిల్లర్లు సైతం ధ్వంసమయ్యాయి. విద్యుత్​ వైర్లు పనిచేయకుండా పోయాయి. వరద తగ్గడంతో ఆలయ సిబ్బంది ద్వారాలు తెరిచి గుడి ఆవరణను శుభ్రం చేశారు. అయితే గర్భగుడిని మాత్రం తెరవ లేదు. ఇంకా రాజగోపురంలోనే పూజలు కొనసాగిస్తున్నారు. మరమ్మతులకు భారీగా నిధులు అవసరం అవుతాయని సిబ్బంది పేర్కొంటున్నారు.