అక్షరటుడే, వెబ్‌డెస్క్: Dial 100 : డయల్ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్ నంబరు. దీనికి కాల్ చేస్తే.. పోలీసులు తక్షణం స్పందిస్తారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటారు.
కాగా, డయల్ 100 అంటే ఆకతాయిలకు ఆటలుగా మారింది. ముఖ్యంగా తాగుబోతులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఇష్టారీతిన కాల్ చేస్తూ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు కూడా కఠినంగానే వ్యవహరిస్తున్నారు.
తాజాగా నిజామాబాద్ జిల్లా (Nizamabad district) ధర్పల్లి పోలీస్ స్టేషన్ (Dharpalli Police Station) పరిధిలో ఫూటుగా మద్యం తాగి, డయల్ 100కు కాల్ చేసి విసిగించిన తాగుబోతుల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ఏకంగా జైలుకే పంపించారు. ఈ ఘటన ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.
Dial 100 : మద్యం మత్తులో పలుమార్లు కాల్స్..
ఎసై కళ్యాణి తెలిపిన వివరాల ప్రకారం.. ధర్పల్లి ఠాణా (Police Station) పరిధిలో ఈ నెల (ఆగస్టు) 4వ తేదీన డీబీ తండాకు చెందిన రూప్లా నాయక్, గణేశ్ మద్యం తాగి డయల్ 100కు కాల్ చేశారు. ఆ రోజు రాత్రి 8:15 గంటలకు, 9:30 గంటలకు, 10 గంటలకు, 11 గంటలకు, 11:30 గంటలకు కాల్ చేసి పోలీసులను విసిగించారు. డయల్ 100 ను దుర్వినియోగం చేస్తూ, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను కోర్టు ఎదుట హాజరుపర్చారు. బుధవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ (Second Class Magistrate) నూర్జహాన్ బేగం కేసు విచారణ చేపట్టారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితులకు నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
Dial 100 : డయల్ 100 యొక్క ఉద్దేశం ఏమిటంటే..
- ఎలాంటి అత్యవసర పరిస్థితిలోనైనా (చోరీ, దాడి, దొంగతనం, అఘటిత ఘటనలు, ప్రమాదాలు) పోలీసుల సాయం కోసం తక్షణమే ఫోన్ చేయొచ్చు.
- ఇది 24×7 సేవలు అందిస్తుంది. పగలు, రాత్రి తేడా లేకుండా ఎప్పుడైనా తక్షణం పోలీసులు స్పందిస్తారు.
- డయల్ 100 కాల్ కు స్పందిస్తూ తక్షణం పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో పోలీసులు వచ్చేస్తారు.
Dial 100 : డయల్ 100 దుర్వినియోగం అంటే..
- అవసరం లేకున్నా ఫేక్ కాల్ చేయడం.
- కాల్ చేసి బూతులు తిట్టడం, ఆటవికంగా మాట్లాడటం, అనవసర సమాచారం ఇవ్వడం.
- సరదా కోసం అబద్ధపు సమాచారం ఇవ్వడం.
- విసిగించేందుకు కాల్ చేయడం.
Dial 100 : దుర్వినియోగానికి పాల్పడితే విధించే శిక్షలు..
భారతీయ శిక్షా సంహిత (IPC) ప్రకారం:
- సెక్షన్ 182 IPC: ప్రభుత్వ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగంపై నిందితులకు జైలు శిక్ష (6 నెలల వరకు) లేదా జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
- సెక్షన్ 505 (1): ప్రజల్లో గందరగోళం,భయం కలిగించే ప్రయత్నం చేసినందుకు గాను జైలు శిక్ష (3 సంవత్సరాల వరకు) లేదా జరిమానా, లేదా రెండూ కూడా అమలు చేయొచ్చు.
- ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ సర్వీసులను అడ్డుకోవడం : తద్వారా అవసరం ఉన్నవారికి సహాయం అందకుండా చేసి, ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించారనే అభియోగంగా పరిగణిస్తారు. దీనిని అత్యంత తీవ్రమైన చర్యగా పరిగణనలోకి తీసుకుంటారు.