అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Mysore Pak | భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రాజస్థాన్ జైపూర్‌లోని Jaipur కొన్ని స్వీట్ దుకాణాలు మైసూర్ పాక్ పేరును కాస్తా.. మైసూర్ శ్రీ(Mysore Sri)గా మార్చిన విషయం తెలిసిందే.
స్వీట్ల పేర్ల నుంచి పాక్ అనే పదాన్ని తొలగించి మోతీ పాక్‌ను మోతీ శ్రీగానూ.. గోండ్ పాక్‌ను గోండ్ శ్రీ అని.. మైసూర్ పాక్‌ను మైసూర్ శ్రీ అంటూ కొత్త పేర్లు పెట్టారు. పాక్ అంటే పాకిస్తాన్ కాదు. అయినప్పటికీ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత అందరిలోనూ దేశభక్తి పెరిగిపోవడంతో రాజస్థాన్ స్వీట్ షాప్ యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మైసూర్ పాక్ సృష్టికర్త కకాసుర మడప్ప మునిమనవడు ఎస్.నటరాజ్(S. Nataraj) స్పందించారు. తన తాత సృష్టించిన మైసూర్ పాక్ పేరును మార్చడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
Mysore Pak | అలా పిలవొద్దు..
మైసూర్ పాక్(Mysore Pak) పేరు మార్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అది చారిత్రక వంటకమని, దాని పేరులోని పాక్‌కు, పాకిస్థాన్‌కు సంబంధం లేదని చెప్పారు. ‘మైసూర్ పాక్‌ను మైసూర్‌పాక్ అనే పిలవండి. మన పూర్వీకులు అందించిన ఆవిష్కరణకు ఇంకో పేరు ఉండదు. కన్నడలో ‘Paaka’ అంటే చక్కర లేదా బెల్లంతో చేసే పదార్థం అని అర్థం. దీనిని తొలుత మైసూర్‌లో తయారు చేయడంవల్ల మైసూర్, పాకా కలిసి మైసూర్ పాక్ అని పేరు వచ్చింది. దీనిని వేరే పేరుతో పిలవడం అనవసరం. దీనికి వేరే అర్థాలు తీయొద్దు’ అని నటరాజ్ కోరారు. కకాసుర మడప్ప(Kakasura Madappa) విషయానికొస్తే, ఆయన మైసూరు వడయార్ రాజకుటుంబానికి వంటవాడిగా సేవలు అందించారు. మైసూరు మహారాజుల కోసం తొలుత ఆయన మైసూర్ పాక్‌ను తయారు చేసి అందించారు.
ఈ పేర్ల మార్పుపై ‘త్యోహార్ స్వీట్స్’ దుకాణం యజమాని అంజలీ జైన్ Anjali Jainమాట్లాడుతూ.. ‘దేశభక్తి అనేది కేవలం సరిహద్దుల్లో ఉంటే సరిపోదు. ప్రతి పౌరుడికి దేశంపై ప్రేమ ఉండాలి. అందుకే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’ అన్నారు. పాక్ అనే పదానికి పాకిస్థాన్(Pakistan)తో సంబంధం లేకపోయినా ఆ శబ్దం పాకిస్థాన్‌ను గుర్తుచేసేలా ఉండటంతో పేరు మార్చినట్లు తెలిపారు. శుభానికి సూచికగా ‘శ్రీ’ (Sri)అనే పదం పెట్టినట్లు చెప్పారు. ఇక యుద్ధం విషయానికి వస్తే.. మే 10వ తేదీన జరిగిన కాల్పుల విరమణతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గాయి.