అక్షరటుడే, వెబ్డెస్క్ : Cabinet Meeting | రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరగనుంది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అయ్యే ఈ మీటింగ్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోసం ప్రజలతో పాటు, గ్రామాల్లో నాయకులు ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. పంచాయతీ పాలకవర్గాల పదవి కాలం 2024 ఫిబ్రవరిలో ముగిసింది. అప్పటి నుంచి సర్పంచులు లేక గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా మాజీలు అయ్యి ఏడాది దాటింది. అలాగే మున్సిపల్ ఎన్నికలు సైతం నిర్వహించాల్సి ఉంది. దీంతో స్థానిక ఎన్నికల (Local Elections) కోసం ప్రజలు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల పంచాయితీ తేలకపోవడంతో ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్లో గెలిచిన అనంతరం సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Cabinet Meeting | పార్టీపరంగా రిజర్వేషన్లు!
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) భావించింది. ఈ మేరకు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించినా.. కేంద్రం పెండింగ్లో పెట్టింది. దీంతో ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో తెచ్చింది. ఈ జీవో ప్రకారం ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకరోజు నామినేషన్లను కూడా స్వీకరించారు. అయితే ఈ జీవోను హైకోర్టు (High Court) కొట్టివేయడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ క్రమంలో పార్టీపరంగా బీసీ రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అలా అయితే ఎలాంటి చిక్కులు లేకుండా ఎన్నికలు జరుగుతాయి. జూబ్లీహిల్స్ గెలుపుతో జోష్లో ఉన్న కాంగ్రెస్ త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కేబినెట్ మీటింగ్ (Cabinet Meeting)లో అందెశ్రీ స్మృతి వనం, అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంపై సైతం నిర్ణయం తీసుకోనున్నారు.
