అక్షరటుడే, వెబ్డెస్క్:Cabinet Meeting | తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ భేటీ ఉండడంతో కేబినెట్ భేటీ(Cabinet Meeting) వాయిదా పడింది. పలువురు మంత్రులు ఢిల్లీలో ఉండాల్సి రావడడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. వాస్తవానికి శుక్రవారమే మంత్రివర్గ సమావేశం కావాల్సి ఉంది. అయితే, కొందరు మంత్రులు పార్టీ మీటింగ్ లో పాల్గొనాల్సి రావడంతో వాయిదా వేయక తప్పలేదు.
Cabinet Meeting | ఢిల్లీలోనే మంత్రులు..
సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)తో పాటు పలువురు మంత్రులు రెండ్రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు గురువారం ఏఐసీసీ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్(Power Point Presentation) ఇచ్చారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో పాటు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి తదితరులు హాజరయ్యారు. ప్రభుత్వం ఆమోదించి పంపించిన బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ పెద్దలను కోరారు.
Cabinet Meeting | ఏఐసీసీ భేటీ కారణంగా వాయిదా..
ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రివర్గం సమావేశం కావాలని ఇటీవలి కేబినెట్ భేటీలో నిర్ణయించారు. అందులో భాగంగానే శుక్రవారం మరోసారి భేటీ కావాల్సి ఉంది. అయితే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ OBC సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి పాల్గొననున్నారు. దీనికి తోడు ఇద్దరు కీలక మంత్రులు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. పార్టీలో కీలక చర్చలు, సమావేశాల నిమిత్తం వారు అక్కడే మకాం వేసినట్లు తెలుస్తోంది. పలువురు మంత్రులు ఢిల్లీలో ఉండటంతో వాయిదా వేయాలని సీఎం నిర్ణయించారు. ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ముఖ్యంగా రైతుల సమస్యలు, వానాకాలం సాగు, విద్యుత్ సరఫరా, కొత్త పాలసీలు, భూ సర్వే, గోశాలల నిర్వహణ తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.