అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Union Cabinet | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన సమావేశమైన మంగళవారం కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను నియంత్రించేందుకు రూపొందించిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతుండగా, సెలెబ్రిటీలు ఈ యాప్‌లకు ప్రచారం చేయడం వివాదాస్పదమైంది. దీనితో, కేంద్రం ఈ బిల్లును రూపొందించింది. బిల్లులో కీలకంగా అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై నిషేధం, వాటికి ప్రచారం చేసే సెలెబ్రిటీలపై చట్టపరమైన చర్యలు, గేమింగ్ యాప్స్‌పై 40 శాతం జీఎస్‌టీ విధించే ప్రతిపాదన తీసుకొచ్చారు.
Union Cabinet | ఇక నుంచి సీరియస్
ఆన్‌లైన్ బెట్టింగ్‌పై 2023లో 28 శాతం జీఎస్‌టీ, 2024-25 నుంచి 30 శాతం పన్ను అమలులో ఉంది. గుర్తింపు లేని యాప్స్‌ను బ్లాక్ చేసే అధికారాన్ని దర్యాప్తు సంస్థలకు అప్పగించారు. కొత్త బిల్లు ఫ్రీ గేమ్‌లను, పే గేమ్‌లను స్పష్టంగా వేరు చేయడం జరుగుతుంది. అలానే నైపుణ్యం ఆధారిత గేమ్‌లు, అదృష్టం ఆధారిత గేమ్‌ల మధ్య తేడాను నిర్ధారించనున్నారు. ఆన్‌లైన్ గేమింగ్‌లో (Online Gaming) జరిగే ఆర్థిక లావాదేవీలపై కఠిన నిబంధనలు, వినియోగదారుల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.
గత ఏడాది కొత్త క్రిమినల్ నిబంధనలతో అనుమతి లేని బెట్టింగ్‌కి (Betting) ఏడేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించేలా చట్టం రూపొందించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కూడా రాజ్యాంగంలోని రాష్ట్రాల జాబితాలో ‘బెట్టింగ్, గ్యాంబ్లింగ్’ అంశాలు ఉన్న క్రమంలో రాష్ట్రాలకూ ప్రధాన అధికారం ఇచ్చారు. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకున్న తాజా బిల్లు ఈ చర్యలకు మరింత బలాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ బిల్లుతో పాటు రాజస్థాన్‌లోని కోటా నగరంలో నూతన గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌కు రూ.1507 కోట్లు మంజూరు చేయనుంది. నిర్మాణ బాధ్యతను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టనుంది. ఈ విమానాశ్రయంతో ప్రాంతీయ కనెక్టివిటీ పెరగడం, స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడం జరుగుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnav) వెల్లడించారు.