అక్షరటుడే, వెబ్డెస్క్ : Gig Workers | గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించి కీలక బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ 2025 బిల్లుకు (Gig Workers 2025 Bill) ఓకే చెప్పింది. దీంతో దీనిని తర్వలోనే అసెంబ్లీలో ప్రవేశ పెట్టే ఛాన్స్ ఉంది.
నీతి ఆయోగ్ నివేదిక (NITI Aayog report) ప్రకారం రాష్ట్రంలో 3 లక్షల మంది గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులు ఉన్నారు. వారు రవాణా, డెలివరీ, గృహ సేవలు, లాజిస్టిక్స్ మొదలైన వాటిలో పనిచేస్తున్నారు. వీరు రోజుకు 10–12 గంటలు, వారానికి 7 రోజులు పని చేస్తారు. ఉద్యోగ భద్రత, బీమా (job security and insurance) వంటి సౌకర్యాలు లేకుండానే వీరు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వారికి మేలు చేసేలా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకు రానుంది. తాజాగా దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
Gig Workers | బిల్లు ముఖ్యాంశాలు
ఈ బిల్లు అమలులోకి వస్తే గిగ్ వర్కర్లకు చట్టబద్దమైన గుర్తింపు లభించనుంది. కార్మికులు రాష్ట్ర పథకాలు (state schemes),రక్షణకు అర్హత పొందుతారు. సామాజిక భద్రత, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయనున్నారు. 20 మంది సభ్యుల బోర్డు ఛైర్మన్గా కార్మిక శాఖ మంత్రి వ్యవహరిస్తారు. సంక్షేమ పథకాలు పొందే అవకాశం కల్పిస్తారు. సురక్షితమైన పని పరిస్థితులను కలిపించే హక్కును గిగ్ వర్కర్లు కలిగి ఉంటారు. చెల్లింపులు, తగ్గింపులు, రేటింగ్లు, అల్గోరిథంలలో పారదర్శకత ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
Gig Workers | రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
గిగ్ వర్కర్లు (Gig workers) ప్రభుత్వ పథకాలు పొందాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కార్మికులు స్వయంగా నమోదు చేసుకోవచ్చు. ప్లాట్ఫారమ్లు 60 రోజుల్లోపు కార్మికుల డేటాను షేర్ చేయాల్సి ఉంటుంది. అగ్రిగేటర్లు 45 రోజుల్లోపు నమోదు చేసుకోవాలి. గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అలాగే కార్మికులను తొలగించాలంటే.. ఒప్పంద మార్పులకు 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. దుష్ప్రవర్తన మినహా తొలగింపునకు 7 రోజుల నోటీసు ఇవ్వాలి.
