అక్షరటుడే, వెబ్‌డెస్క్: bypass road ventures | నిజామాబాద్‌లోని కంఠేశ్వర్ – మాధవనగర్ బైపాస్ రోడ్డు పరిధి భూములు ప్రస్తుతం హాట్ కేక్‌ల్లా మారిన విషయం తెలిసిందే. ఒకప్పుడు ఎకరాకు రూ. 50 లక్షలు పలకని భూములు.. నేడు రూ. 10 కోట్లు పెట్టినా దొరకని పరిస్థితి నెలకొనడం గమనార్హం. ఇదే అదనుగా రియల్టర్లు.. వీరితో చేతులు కలిపిన రెవెన్యూ అధికారులు.. తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ప్రభుత్వ భూముల రికార్డులను రాత్రికిరాత్రే తారుమారు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో పనిచేసిన ఓ ఐఏఎస్ అధికారి అండదండలతో ఇద్దరు రియల్టర్లు, మరో ఇద్దరు రెవెన్యూ అధికారులు రియల్ దందాను.. మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నచందంగా సాగించారు. ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నారు.
కాగా, వీరి కంబంధ హస్తాల్లోకి అత్యంత విలువైన భూములన్నీ ఇప్పటికే వెళ్లిపోయాయి. దీనికితోడు నిషేధిత భూములు సైతం వీరి గుప్పిట్లోకి చేరడం.. వాటికి పట్టాలు పుట్టుకురావడం గమనార్హం. ఇదే విషయాన్ని ‘అక్షరటుడే’ కథనం ప్రచురితం కాగా.. అటు రియల్టర్లు , ఇటు రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. సదరు రెడ్డి ఐఏఎస్ అధికారి అండదండలతో జిల్లా మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తీసుకుని.. వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా వ్యవహరించిన అధికారులు ఎవరనే దానికిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
bypass road ventures | నోటిఫైడ్ కాల్వ ఆక్రమణ..
బైపాస్ సమీపంలోని గూపన్పల్లి శివారు సర్వే నంబరు 318ను ఆనుకుని ఇరిగేషన్ శాఖ నోటిఫైడ్ చేసిన కాల్వ ఉంది. కాగా, దీనికి ఆనుకుని ప్రధాన రహదారి వరకు బడా రియల్టర్లు విల్లా వెంచర్‌ను ఏర్పాటు చేశారు. అయితే, ఈ వెంచర్లో బఫర్ జోన్ స్థలాన్ని వదలకుండా నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కినట్లు సమాచారం.
ప్రస్తుత నిబంధనల ప్రకారం నోటిఫైడ్ కాల్వకు ఆనుకుని ఉన్న భూముల్లో నివాస సముదాయాలు ఏర్పాటు చేయాలంటే.. ముందుగా 9 మీటర్ల బఫర్ జోన్ స్థలంతోపాటు 30 అడుగుల అప్రోచ్ రోడ్డు వదలాలి. కాగా, సదరు వెంచర్లో తమకేమీ సంబంధం లేకపోయినా.. ఇరిగేషన్ బఫర్‌జోన్ స్థలాన్ని ఆక్రమించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జియో కోడ్నెట్, గూగుల్ మ్యాప్‌లు సైతం అక్రమాన్ని బహిర్గతం చేస్తున్నాయి. అయినప్పటికీ జిల్లా రెవెన్యూ యంత్రాంగం కన్నెత్తి చూడకపోవడం కొసమెరుపు.
బడా నేతల అండదండలు..
ఇక మరో దారుణ విషయం ఏమిటంటే.. సదరు వెంచర్లో ఇద్దరు ప్రముఖ బడా నేతలు విల్లాలు తీసుకోవడం. ఇటీవలే ఓ నేత సదరు వెంచర్లో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించుకున్నట్లు సమాచారం. ఎవరూ తప్పు చేయొద్దని, తప్పు చేస్తే తాను సహించనని.. నీతి నిజాయతీ.. అని ప్రగల్బాలు పలికే సదరు నేత.. ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడిన వారికి సహకరించడం ఒక ఎత్తయితే.. వాటిలోనే విల్లా తీసుకుని, గృహ ప్రవేశం చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఇది సరిపోదంటూ. . మరో నేత సైతం సదరు వెంచర్లో ఓ విల్లా తీసుకున్నట్లు ప్రచారంలో ఉంది. ఏది ఏమైనప్పటికీ ఉల్లంఘనల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అధికార పార్టీ నేతలు.. అక్రమార్కులకే కొమ్ముకాయడం విమర్శలకు దారితీస్తోంది.