అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా సాగనుంది. మూడు ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నాయి. మంగళవారంతో నామినేషన్ల (Nominations) పర్వం ముగియగా.. ఇక ప్రచారం జోరందుకోనుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని కాంగ్రెస్ (Congress) సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఒకవేళ ఓడిపోతే దీని ప్రభావం స్థానిక ఎన్నికలపై ఉండనుంది. అలాగే కాంగ్రెస్ పాలనకు ఈ ఎన్నికలను రెఫరండంగా భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకొని తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ (BRS) యోచిస్తోంది. బీజేపీ సైతం హిందు ఓట్లను సంఘటితం చేసి విజయం సాధించాలని చూస్తోంది. ఈ మేరకు మంగళవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ.. బంజరాహిల్స్‌లో ప్రభుత్వం కూల్చేసిన పెద్దమ్మ గుడిని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కట్టిస్తామన్నారు.
Jubilee Hills | ప్రచారం చేయనున్న కేసీఆర్
జూబ్లీహిల్స్‌లో నామినేషన్ల పర్వం ముగియడంతో ఆయా పార్టీలు ఇక ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్ ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేయగా.. తాజాగా బీఆర్ఎస్, బీజేపీ రిలీజ్ చేశాయి. బీఆర్ఎస్ 40 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. ఇందులో మాజీ సీఎం కేసీఆర్ (KCr)తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్, మహమూద్‌అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా కొంతకాలంగా.. ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్ ఈ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సీటును కాపాడుకోవడానికి బీఆర్ఎస్ కేసీఆర్ సభ పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Jubilee Hills | బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు
ఉప ఎన్నిక కోసం బీజేపీ సైతం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్, ఏపీ మంత్రి సత్యకుమార్, పురందేశ్వరి తదితరులు ఉన్నారు. కాగా కాంగ్రెస్ లిస్ట్‌లో కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు, సీనియర్ నాయకులు ఉన్నారు.