అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jubilee Hills by-election | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ (Jubilee Hills Assembly constituency) ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతితో ఖాళీ అయిన ఈ స్థానం కోసం మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా బరిలో దిగాయి.బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ భార్య మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ (Naveen Yadav) , బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. మొత్తం 58 మంది అభ్యర్థులు రేసులో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ఈ ముగ్గురి మధ్యే నెలకొంది.
Jubilee Hills by-election | సెంటిమెంట్‌తో పాటు వ్యూహాలతో ముందుకు..
ప్రచారం నేటితో ముగియనుండగా, నవంబర్ 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికను ప్రభుత్వ ప్రతిష్టాత్మక పరీక్షగా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) స్వయంగా ప్రచార బరిలోకి దిగారు. నాలుగు రోజుల పాటు రోడ్‌షోలు, సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో పర్యటించి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ గెలిస్తే అది ప్రజల విశ్వాసానికి ముద్ర అని రేవంత్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ హామీలు నెరవేరలేదన్న విమర్శలు కాంగ్రెస్‌ను కొంత ఇబ్బంది పెడుతున్నాయి. ఇదే అంశం బీఆర్ఎస్కు బలంగా దొరికింది.
మాగంటి సునీత అభ్యర్థిత్వంతో బీఆర్ఎస్ సానుభూతి సెంటిమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈ ఎన్నికకు పూర్తి వ్యూహరచన చేసి, రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు, డిజిటల్ ప్రచారం ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు చేయడం లేదంటూ.. “బాకీ హామీలు”ను హైలైట్ చేస్తూ, “ప్రతీ వాగ్దానం మాటల్లోనే ఉంద”ని విమర్శించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) కూడా చివరి రెండు రోజుల్లో ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు.
బీజేపీ అభ్యర్థి ఎంపికలో ఆలస్యం కారణంగా ప్రచారం తక్కువ స్థాయిలో సాగింది. అయినా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి (Union Minister G. Kishan Reddy) స్వయంగా ప్రతి డివిజన్లో రోడ్‌షోలు నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ రఘునందన్‌రావు వంటి నేతలు కూడా ప్రచారంలో పాల్గొన్నప్పటికీ స్థానిక స్థాయిలో పార్టీ కేడర్ లోపం బీజేపీకి అడ్డంకిగా మారింది. ప్రధాన పార్టీలు కాకుండా మరో 55 మంది స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. వారిలో కొంతమంది నిరుద్యోగులు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ బరిలో దిగిన వారు ఉన్నా.. వారి ప్రచారం మాత్రం పెద్దగా కనిపించలేదు.