అక్షరటుడే, కామారెడ్డి: Bharatiya Vidyarthi Morcha | తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) అవకతవకలపై పారదర్శక విచారణ జరపాలని భారతీయ విద్యార్థి మొర్చా(BVM) రాష్ట్ర కార్యదర్శి విఠల్ డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక లావాదేవీలలో అవకతవకలు, నియామక ప్రక్రియలో అనుచిత చర్యలు విద్యార్థులలో తీవ్ర ఆందోళన కలిగించాయన్నారు. విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను కాపాడాలంటే సంబంధిత బాధ్యులపై తక్షణ చర్య తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ (CBI) లేదా విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాలు విద్యాకేంద్రాలుగా ఉండాలే కానీ అవినీతి కేంద్రాలుగా మారుతున్నాయన్నారు.
నియామక ప్రక్రియలో అర్హత లేని వ్యక్తులకు ఉద్యోగాలు కల్పించటం, తప్పుడు సర్టిఫికెట్లకు అప్పటి అధికారులు సపోర్ట్ చేసి యూనివర్సిటీని భ్రష్టు పట్టించారన్నారు. తప్పుడు నియామకాల వల్ల నష్టపోయిన అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పుపై వెంటనే విచారణ చేపట్టి దోషుల పైన కేసు నమోదు చేయాలని, తెలంగాణ యూనివర్సిటీని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఇన్ఛార్జి అర్బాస్ ఖాన్, నాయకులు రాహుల్, మనోజ్, బుల్లెట్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
