అక్షరటుడే, ఆర్మూర్ : Nandipet | ఆర్టీసీ బస్‌డిపో (RTC Bus Depot) కోసం నందిపేట్ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారు. ఈ మేరకు మంగళవారం స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. బస్ డిపో ఉద్యమ కమిటీ పిలుపు మేరకు మండలంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఉదయం 6 గంటల నుంచే ఉద్యమకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.
Nandipet | ప్రజా మద్దతుతో విజయవంతం
బంద్ నేపథ్యంలో అంగళ్లు, విద్యాసంస్థలు, ప్రైవేటు కార్యాలయాలు (Private Offices) మూసివేసి యజమానులు తమ మద్దతు ప్రకటించారు. ఆటోలు, ప్రైవేట్ వాహనాలు నిలిచిపోవడంతో మండల కేంద్రంలోని వీధులన్నీ జనసంచారం లేక వెలవెలబోయాయి. ‘ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన భూమిని డిపో కోసమే కేటాయించాలి’ అని నిరసనకారులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Nandipet | గట్టి పోలీస్ బందోబస్తు
బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆర్మూర్ ఏసీపీ (Armoor ACP) పర్యవేక్షణలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడా ఉద్రిక్తతలు తలెత్తకుండా శాంతియుత వాతావరణంలో నిరసనలు కొనసాగాయి.
Nandipet | డిపో వచ్చే వరకు పోరాటం ఆగదు..
ఈ సందర్భంగా ఉద్యమ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. దశాబ్దాల కాలంగా ఆర్టీసీ డిపో కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వాలు కనికరించడం లేదన్నారు. డిపో ఏర్పాటుతో కేవలం ప్రయాణ సౌకర్యాలే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి, వ్యాపార అభివృద్ధి సాధ్యమవుతాయన్నారు. డిపో మంజూరయ్యే వరకు మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మండల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రజలందరూ ఏకతాటిపైకి రావడం సంతోషంగా ఉందన్నారు.