అక్షరటుడే, వెబ్డెస్క్ : Indonesia Accident | ఇండోనేషియాలో ఘోర బస్సు ప్రమాదం (Bus Accident) చోటు చేసుకుంది. కాంక్రీట్ నిర్మాణాన్ని బస్సు ఢీకొనడంతో 16 మంది మృతి చెందారు.
ఇండోనేషియా ప్రధాన ద్వీపం జావాలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సుఅదుపు తప్పి రోడ్డుపై ఉన్న కాంక్రీట్ దిమ్మను ఢీకొట్టి పక్కకు పడిపోయింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నారు.
Indonesia Accident | సహాయక చర్యలు
జకార్తా నుంచి యోగ్యకర్తకు ప్రయాణిస్తున్న ఇంటర్-ప్రావిన్స్ బస్సు సెంట్రల్ జావాలోని సెమరాంగ్ నగరం (Semarang City)లోని క్రాప్యాక్ టోల్వే వద్ద వంపుతిరిగిన ఎగ్జిట్ రాంప్లోకి ప్రవేశిస్తుండగా బోల్తా పడిందని అధికారులు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ (Search and Rescue Operation) చేపట్టారు. ప్రమాదం జరిగిన 40 నిమిషాల తర్వాత రెస్క్యూ టీం, పోలీసులు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఘటన స్థలంలో ఆరుగురి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. చికిత్స పొందుతూ మిగతా వారు చనిపోయారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇండోనేషియాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఇక్కడ వాహనాలు పాతవి, సరైన నిర్వహణ లేకపోవడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతాయి. 2024లో ఈద్ అల్-ఫితర్ జరుపుకోవడానికి ప్రజలు ప్రయాణిస్తుండగా రద్దీగా ఉండే హైవేపై ఒక కారు బస్సును, మరో కారును ఢీకొట్టడంతో కనీసం 12 మంది మరణించారు. 2019లో పశ్చిమ సుమత్రా ద్వీపంలో ఒక బస్సు లోయలో కనీసం 35 మంది మరణించారు.