అక్షరటుడే, ఇందూరు: Buffer Zone | రియల్టర్ల (realtors) దోపిడీకి హద్దూ అదుపు ఉండటం లేదు. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ పాగా వేస్తున్నారు. సాధారణ ప్రజలను మభ్యపెట్టి నిర్మాణాలను కట్టబెడుతున్నారు.
డబ్బులు పూర్తిగా కట్టేశాక.. అవి అక్రమ నిర్మాణాలని తేలడంతో ఫ్లాట్ ఓనర్లు లబోదిబో మంటున్నారు. ఇందూరులో దోపిడీకి నిర్మాణ రంగం కేంద్రంగా మారింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అపార్ట్మెంట్ కల్చర్ ఇరవై ఐదేళ్ల క్రితం ఆరంభమైంది.
ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేసి, సొంతింటిని కట్టుకోవాలేని వారు.. అపార్ట్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే నిజామాబాద్ నగరంలో అపార్ట్మెంట్ కల్చర్ విస్తరించింది. కాగా, మధ్య తరగతి వారి సొంతింటి కలను తమ వ్యాపారాభివృద్ధికి అనుకూలంగా మార్చుకుంటున్నారు కొందరు రియల్టర్లు. ప్రజలను ఏమార్చి, ఆకాశంలో మేడలు, సౌకర్యాలు చూపి ఫ్లాట్లను కట్టబెడుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు, సిబ్బందికి అడిగినంత డబ్బులు ఇచ్చి, ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు.
Buffer Zone | బఫర్‌జోన్‌లో అపార్ట్మెంట్ నిర్మాణం..
నిర్మాణ రంగంలో అక్రమ సంపాదనే ధ్యేయంగా పేట్రేగిపోతున్న కొందరు రియల్టర్లలో అశోక గ్రూపు Ashoka Group కూడా ఒకటి. నాణ్యతకు మారుపేరుగా చెప్పుకొనే ఈ బిల్డరు అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. ఇందూరులో తామే ఎక్కవ నిర్మాణాలు చేపట్టి, విక్రయించినట్లు చెప్పుకొంటున్న ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి నిర్మాణాల్లో నిబంధనలను తుంగలో తొక్కుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే ఈ రియల్టర్ అక్రమాలు వెలుగు చూశాయి. నగరంలోని వినాయకనగర్‌లో అశోక కానుగంటి అపార్ట్మెంట్లో నిబంధనలను తుంగలో తొక్కి మడిగెల నిర్మాణం చేపట్టారు. కార్పొరేషన్ స్థలం ఆనుకొని ఉన్న గ్రీనరీ స్థలంలో కమర్షియల్ మడిగెలు నిర్మించారు. ఈయన చేపట్టిన నిర్మాణాల్లో చాలా చోట్ల ఇలా నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టం అవుతోంది. ఇక విషయానికి వస్తే.. తాజాగా రియల్ ఎస్టేట్ వ్యాపారి realtor అశోక్ అక్రమం మరోటి వెలుగుచూసింది. హైదరాబాద్ రోడ్డు మార్గంలోని పాంగ్రా శివారులో చేపట్టిన మరో నిర్మాణం construction లో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారు.
అశోక ఎలైట్ పేరిట చేపట్టిన ఈ అపార్ట్‌మెంట్‌ను కొంత కాలం క్రితం నిర్మించారు. కాగా, దీనిని పక్కనే ఉన్న వాగు శిఖం భూమిలో ఈ కట్టడం నిర్మించినట్లు చెబుతున్నారు. అశోక ఎలైట్ పక్కనే వాగు ఉంది. కాగా, ఈ వాగు శిఖం భూమిలోనే అపార్ట్మెంట్లోని కొంత భాగం కట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అంటే వాగు శిఖం బఫర్‌జోన్‌లో అపార్ట్మెంట్ నిర్మించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మున్సిపాలిటీ అధికారులకు, స్థానిక నేతలకు పెద్ద మొత్తంలో బిల్డరు నగదు ముట్టజెప్పినట్లు ప్రచారంలో ఉంది.
అశోక్ ఎలైట్‌లో క్లబ్ హౌస్ నిర్మించారు. ఈ నిర్మాణం అంతా బఫర్‌జోన్‌లో ఉన్నట్లు సమాచారం. దీనికితోడు అపార్ట్మెంట్లోని కొంత భాగం కూడా బఫర్‌జోన్‌లోకి వస్తుందంటున్నారు. ఇలా నిర్మాణ రంగంలో అడ్డగోలుగా సంపాదించి.. అధికారులను, ప్రజాప్రతినిధులను డబ్బుతో కొనేసి.. తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటున్న బిల్డర్లు కోకొల్లలుగా మారారు.
