అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ball Tampering | భారత జట్టుతో జరిగిన నాల్గో టెస్టులో విజయం కోసం ఇంగ్లండ్ జట్టు ఎన్ని ప్రయోగాలు చేసిందో మనం చూశాం. మ్యాచ్ లాస్ట్ రోజు వరకూ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Captain Ben Stokes) అన్ని వ్యూహాలను ప్రయోగించగా, వాటిలో స్లెడ్జింగ్ కూడా ఒకటి. భారత బ్యాటర్లను గందరగోళానికి గురిచేయాలని ఎంతగానో ప్రయత్నించిన ఇంగ్లండ్‌కు చివరకు నిరాశే మిగిలింది. ఎందుకంటే జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు అద్భుతమైన ఓపికతో బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను డ్రాగా నిలిపారు. ఇక ఫీల్డ్ సెటప్‌లు మార్చడం, బౌలర్లను చకచకా రొటేట్ చేయడం, నోటికి పని చెప్పడం ఇలా సర్వత్రా ప్రయత్నించిన తర్వాత చివరకు ఇంగ్లండ్ బౌలర్లు ఫ్రస్ట్రేషన్‌కు లోనయ్యారు. దాంతో వారు నిబంధనలు అతిక్రమించే స్థాయికి వెళ్లారు.
Ball Tampering | మరీ ఇంత దారుణమా?
ఈ సందర్భంగా ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్స్ (Brydon Carse) చేసిన చర్య కలకలం రేపుతోంది. బంతిని కాలి కింద పెట్టి తొక్కిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవుతోంది. ఇది బాల్ ట్యాంపరింగ్ (Ball Tampering) కిందకు వస్తుందని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. బాల్‌ను చెమట, ఉమ్మి ద్వారా పాలిష్ చేయడం నిబంధనల ప్రకారం అనుమతించబడినా, దానిని గోర్లతో గీకడం, కాళ్లతో తొక్కడం, ఇతర వస్తువులతో రుద్దడం లాంటివి ట్యాంపరింగ్ నేరంగా పరిగణిస్తారు. ఇది ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం లెవల్ 3 నేరం. దీనిపై కనీసం 6 టెస్టులు లేదా 12 వన్డేలు నిషేధం విధించే అవకాశం ఉంటుంది.
ఆస్ట్రేలియా జట్టు ప్లేయర్స్ వార్నర్, స్టీవ్ స్మిత్ (Warner and Steve Smith) 2018లో బాల్ ట్యాంపరింగ్ చేసినందుకు రెండేళ్ల నిషేధం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడీ నేపథ్యంలో బ్రైడన్ కార్స్ (Brydon Carse) చర్యపై భారత అభిమానులు ఐసీసీ చర్య తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఫోర్త్ టెస్ట్ లాస్ట్ రోజు భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. జడేజా 107 నాటౌట్ (185 బంతుల్లో, 13 ఫోర్లు, 1 సిక్స్), సుందర్ 101 నాటౌట్ (206 బంతుల్లో, 9 ఫోర్లు, 1 సిక్స్) చేయగా కెప్టెన్ గిల్ కూడా సెంచరీ చేశాడు. కేఎల్ రాహుల్ కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఇంగ్లండ్ (England) గెలిచే ఛాన్స్ భారత్ ఇవ్వలేదు. అయితే ఇంగ్లండ్ జట్టు మ్యాచ్‌ను గెలవాలనే కసితో బాల్ ట్యాంపరింగ్ వరకు వెళ్లగా, ఐసీసీ ఈ ఘటనపై ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.