అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా ఓ వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది. భూ తగాదాల నేపథ్యంలో జరిగిన ఈ హత్య బీబీపేట మండలం శివారు రాంరెడ్డి పల్లి (Ramreddy Palli) శివారులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బీబీపేట్ మండల (Bibipet Mandal) కేంద్రంలోని శివారు రాంరెడ్డిపల్లికి చెందిన కోక్కోల సత్యం (50) లచ్చయ్యలు గ్రామంలో పక్కపక్కనే నివాసం ఉంటారు. అలాగే వారి వ్యవసాయ భూమి కూడా పక్కపక్కనే ఉంది. గత కొంతకాలంగా సత్యం, లచ్చయ్యల మధ్య భూ వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో లచ్చయ్య, సత్యం తరచూ గొడవపడేవారు. మంగళవారం రాత్రి లచ్చయ్య కొకోళ్ల సత్యంను కర్రతో కొట్టి దారుణంగా హత్య చేశాడు.
అనంతరం లచ్చయ్య స్థానిక బీబీపేట్ పోలీస్ స్టేషన్లో (Bibipet Police Station) లొంగిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు రాంరెడ్డి పల్లికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జీజీహెచ్‌కు (Kamareddy GGH) తరలించారు. తెల్లవారితే ఎన్నికలు జరుగుతుండగా దారుణ హత్య మండలంలో కలకలం రేపింది. ఓవైపు పోలీసులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో పోలీసు శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.