Homeజిల్లాలునిజామాబాద్​Local body elections | స్థానిక ‘యుద్ధానికి’ బీఆర్​ఎస్​ సిద్ధం: మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

Local body elections | స్థానిక ‘యుద్ధానికి’ బీఆర్​ఎస్​ సిద్ధం: మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు బీఆర్​ఎస్​ సిద్ధంగా ఉందని బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Local body elections | స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు బీఆర్​ఎస్​ సిద్ధంగా ఉందని.. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్​ ఖతమవడం ఖాయమని పార్టీ​ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి (Jeevan Reddy) అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు.

ప్రభుత్వం ముందుగా నిర్వహించాలని భావిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో (panchayat elections) బీఆర్ఎస్ హీరో, కాంగ్రెస్ జీరో కావడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. రేవంత్‌ సర్కార్‌ మోసాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహజ్వాలలు పెల్లుబికుతున్నాయన్నారు.

సరైన సమయంలో కాంగ్రెస్​కు కర్రుకాల్చి వాతలు పెట్టేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని జీవన్​రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు భరించలేక రేవంత్ రెడ్డి గోబ్యాక్, కేసీఆర్ కమ్​బ్యాక్ (KCR Come Back) అని అన్ని గ్రామాలు నినదిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు గాల్లో కలిసిపోయాయని, 420 హామీల అమలు ఊసే లేదని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యూరియా, విత్తనాల కొరత తీర్చలేని ఈ దిక్కుమాలిన ప్రభుత్వం తమకెందుకని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని జీవన్ రెడ్డి తెలిపారు.

రుణమాఫీ సగంసగం చేసి నిలువునా ముంచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు (Rythu Bandhu) ఇవ్వకుండా అన్నదాతలకు ద్రోహం చేశారని రైతులు మండిపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రేవంత్‌ పాలనలో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయని, పల్లెల్లో పాలన పడకేసిందని, పారిశుధ్యం లోపించి గ్రామాల్లో చెత్తాచెదారం, పందులు, దోమలు స్వైరవిహారం చేస్తుండడంతో వ్యాధులు ప్రబలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Local body elections | డీజిల్​ లేక చెత్త ట్రాక్టర్లు మూలకు..

చెత్త తరలించే ట్రాక్టర్లు డీజిల్ లేక తుప్పు పడుతున్నాయని, ప్రకృతి వనాలు పచ్చదనం పోయి ఎండిపోతున్నాయని జీవన్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కేసీఆర్ హయాంలో ఎట్లుండే.. ఇప్పుడెట్లుందని ప్రశ్నించారు. పాలిచ్చే బర్రెనమ్మి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లయిందని ఆయన వ్యాఖ్యానించారు.

Local body elections | దిక్సూచి లేని దిక్కుమాలిన పాలన..

రేవంత్ ది దిక్చూచి లేని దిక్కుమాలిన పాలన అని జీవన్​రెడ్డి మండిపడ్డారు. అవినీతి, అణచివేత, కేసులు, అరెస్టులు, భూకబ్జాలు తప్ప.. అణాపైస అభివృద్ధి ఉందా అని ఆయన నిలదీశారు. కేసీఆర్ హయాంలో ‘ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతీ కంట్లో సంతోషం’ వెల్లివిరియగా రేవంత్ (Revanth Reddy) హయాంలో ‘ప్రతి ఇంట్లో సంక్షోభం, ప్రతి కంట్లో విషాదం ఆవరించిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు విడమర్చి వివరిస్తామని ఆయన వెల్లడించారు. కాగా.. నిజామాబాద్ జిల్లాలో (Nizamabad district) ఎక్కడ చూసినా ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాల ఆగడాలే కనిపిస్తున్నాయన్నారు. జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ నేతల దోపిడీ పర్వం కొనసాగుతోందన్నారు.

Local body elections | జిల్లా నుంచే కాంగ్రెస్ పతనం ప్రారంభం..

నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కంచుకోట అని, కాంగ్రెస్ పతనాన్ని ఇందూరు గడ్డ నుంచే శాసిస్తామని జీవన్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్(KCR)ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేవరకూ నిద్రబోమన్నారు. ఒంటరిగానే పోటీ చేసి వంద సీట్లతో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసి డ్యూటీ ఎక్కుతామన్నారు. ఏవో పనికిమాలిన పార్టీల్లో బీఆర్ఎస్ విలీనం అంటూ చెత్తప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విలీనం కాదు కదా ఏ పార్టీతో పొత్తు కూడా పెట్టుకోమని స్పష్టం చేశారు.

Local body elections | త్వరలో జిల్లా పర్యటన చేస్తా..

త్వరలోనే జిల్లా అంతటా పర్యటిస్తానని జీవన్​రెడ్డి పేర్కొన్నారు. గులాబీ శ్రేణులను స్థానిక సంస్థల ఎన్నికలకు (local body elections) సమాయత్తం చేస్తానని జీవన్ రెడ్డి ప్రకటించారు. ఆపద కాలంలోనూ పార్టీ కోసం పోరాడుతున్న గులాబీ శ్రేణులకు పాదాభివందనం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యం వద్దు కేసీఆర్ రాజ్యం ముద్దు అన్నది తెలంగాణ ప్రజల నినాదంగా ముందుకు పోతామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్‌ చేస్తోన్న మోసాలను ఎండగడతామన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ అవినీతి, అప్రజాస్వామిక విధానాలను గ్రామగ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ కారు, సారు కేసీఆర్ రావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

Local body elections | జిల్లాతో బీఆర్ఎస్​కు పేగుబంధం..

నిజామాబాద్ జిల్లాతో బీఆర్ఎస్ ది పేగు బంధమని జీవన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి తొలి అధికార పదవినందించిన చరిత్ర నిజామాబాద్ జిల్లాదేనని గుర్తు చేశారు. సంతోష్ రెడ్డిని జిల్లాపరిషత్ ఛైర్మన్​ను చేసుకొని బీఆర్ఎస్ విజయానికి శ్రీకారం చుట్టిన చరిత్ర నిజామాబాద్ జిల్లాకు దక్కిందన్నారు. కేసీఆర్​ను మూడోసారి సీఎం చేయడంలోనూ నిజామాబాద్ జిల్లాదే ప్రధానపాత్ర అని జీవన్ రెడ్డి పునరుద్ఘాటించారు.