అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bus Bhavan | బస్ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ (BRS) నాయకులు నిరసన చేపట్టారు. హైదరాబాద్‌లోని బస్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.
ఆర్టీసీ ఇటీవల హైదరాబాద్ సిటీ (Hyderabad City) బస్సుల్లో ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా గురువారం ఉదయం బీఆర్ఎస్ నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao), బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున బస్‌భవన్‌కు బయలు దేరారు. కేటీఆర్, హరీశ్‌రావు ఆర్టీసీ బస్‌లో ప్రయాణించారు. ఛార్జీల పెంపును వారు ఖండించారు.
Bus Bhavan | ఛార్జీలు తగ్గించాలి
కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విచక్షణారహితంగా సిటీ బస్సు చార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు అని చెబుతున్నారని, కానీ బస్సుల్లో వారికి సీట్లు దొరకడం లేదన్నారు. బస్సుల సంఖ్య పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఏసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. మహిళలకు ఫ్రీ అని చెప్పి, మగవారికి ఛార్జీలు డబుల్ చేశారని, పిల్లలకు బస్ పాసుల ఫీజును పెంచితే కుటుంబం మీద భారం పడదా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమ హయాంలో మొదలెట్టిన ఆర్టీసీ కార్గో సేవలు సంవత్సరానికి రూ.100 కోట్ల ఆదాయం తెస్తే, దాన్ని రూ.36 కోట్లకు ప్రైవేట్ పరం చేశారని విమర్శించారు. పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
Bus Bhavan | ప్రైవేట్‌పరం చేసే కుట్ర
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కమీషన్ల కోసం బడా బడా కాంట్రాక్టర్లకు, ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టులు కట్టబెట్టడానికి ఈ కుట్రకు తెరలేపారన్నారు. రాష్ట్రంలోని అనేక బస్టాండ్లను తాకట్టు పెట్టి రేవంత్‌రెడ్డి రూ.1500 కోట్లు అప్పు తెచ్చాడని ఆరోపించారు. ఆయన మెహదీపట్నం నుంచి బస్ భవన్ వరకు బస్సులో ప్రయాణించారు.
Bus Bhavan | అడ్డుకున్న పోలీసులు
బీఆర్ఎస్ బస్‌భవన్‌కు పిలుపునివ్వడంతో భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు. దీంతో పోలీసులు వారిని అక్కడ అడ్డుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు బస్ భవన్‌కు వెళ్లే మార్గాలను మూసేశారు. భారీ కేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగా ఆర్టీసీ ఎండీని కలవడానికి పోలీసులు ముగ్గురు బీఆర్ఎస్ నేతలకు అనుమతి ఇచ్చారు. వారు ఎండీని కలిసి రేట్లు తగ్గించాలని కోరానున్నారు.