అక్షరటుడే, ఆర్మూర్: Mla Prashanth reddy | జిల్లాలోని వేల్పూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి (Manala Mohan reddy) ఆధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ కనువిప్పు కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేల్పూర్‌లో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డికి కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తానంటూ బయల్దేరేందుకు సిద్ధమైన మానాల మోహన్ రెడ్డిని పోలీసులు జిల్లా కేంద్రంలో హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు.
Mla Prashanth reddy | వేల్పూర్‌లో ఉద్రిక్తత..
వేల్పూర్‌లో పరిస్థితి చేయిదాటకుండా ఉందేందుకు సీపీ సాయిచైతన్య (CP Sai chaitanya) ముందస్తు చర్యలు తీసుకున్నారు. ముందుగానే మండలంలో 163 బీఎన్ఎస్ యాక్ట్ (BNS Act) అమలుకు ఆదేశించారు. అయితే పలువురు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. వారిని అడ్డుకుని పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Mla Prashanth reddy | ఎమ్మెల్యే ఇంట్లోకి గుట్టుచప్పుడు కాకుండా..
ఉద్రిక్తత నడుమ జిల్లా గల్ఫ్ సంక్షేమ సంఘం(District Gulf Welfare Association) నాయకుడు, కాంగ్రెస్ ప్రతినిధి నంగి దేవేందర్‌రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఇంట్లో జరుగుతున్న విషయాలను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తల్లో కలిసిపోయి ఎమ్మెల్యే ఇంట్లోకి చేరినట్లు సమాచారం. అక్కడి నుంచి సదరు కాంగ్రెస్ నాయకుడు సెల్ఫోన్లో వీడియో లైవ్‌పెట్టి అక్కడి విషయాలను కాంగ్రెస్ నాయకులకు తెలియజేసేందుకు ప్రయత్నించినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. చివరికి ఆ వ్యక్తి బీఆర్ఎస్కు చెందిన వాడు కాదని గుర్తించిన కార్యర్తలు దేహశుద్ధి చేసినట్లు సమాచారం. అనంతరం ఇంట్లోనే ఉన్న ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి సదరు గొడవను విని ఆ కాంగ్రెస్ నాయకుడిని వదిలేయాలని పేర్కొనగా.. పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.
Mla Prashanth reddy | కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ..
పోలీసుల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ.. 163 బీఎన్ఎస్ అమల్లో ఉండగా.. గుట్టుచప్పుడు కాకుండా ఓ కాంగ్రెస్ నాయకుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లోకి ప్రవేశించి వీడియో ద్వారా లైవ్ పెట్టేందుకు ప్రయత్నించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పోలీసులు సైతం కాంగ్రెస్ నాయకులకే మద్దతు తెలుపుతున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు పలువురు ఆరోపిస్తున్నారు.