అక్షరటుడే, ఇందూరు: Kalvakuntla Kavitha | నిజామాబాద్‌లో నా ఓటమికి బీఆర్ఎస్ పార్టీనే కారణమని.. ఈ విషయం నాయకులందరికీ తెలుసని తెలంగాణ జాగృతి (Telanagana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ‘జనంబాట’లో (Janam bata) భాగంగా జిల్లా కేంద్రంలోని జాగృతి కార్యాలయం వద్ద శనివారం ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో బీఆర్ఎస్ (BRS), కేసీఆర్ (KCR) కోసం పనిచేశానన్నారు. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ఓపికతో ముందుకు సాగానని గుర్తు చేశారు. కానీ చివరికి తనను ఓడించేందుకు బీఆర్ఎస్ నాయకులే కుట్ర పన్నడం ఎంతో కలిచివేసిందని వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి విడిపోయిన తర్వాత ప్రజల కోసం సొంత దారిలో నడుస్తున్నానన్నారు.
Kalvakuntla Kavitha | తొలి ఆశీర్వాదం జిల్లా నుంచే కావాలి..
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మేధావులు, విద్యావేత్తలు, కుల సంఘాలు, ప్రజాసంఘాలతో భేటీ అవుతానని ప్రజా సమస్యలపై ఉద్యమం కొనసాగిస్తానని కవిత తెలిపారు. తాను నిజామాబాద్ జిల్లా కోడలినని, తొలి ఆశీర్వాదం జిల్లా ప్రజలు ఇవ్వాలనే ఉద్దేశంతో జనంబాట ఇక్కడి నుంచే ప్రారంభించానని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ (Radical Students Union) వరకు అందరినీ ఆదరించిన జిల్లా నిజామాబాద్ అని కొనియాడారు.
Kalvakuntla Kavitha | రెండేళ్లయినా ఏమీ చేయలేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఏమి చేయలేకపోయిందని కవిత విమర్శించారు. మహిళలకు పెన్షన్ పెంపు, నిరుద్యోగులపై వివక్ష కొనసాగుతోందన్నారు. గత పదేళ్లలో కొంతవరకు సాధించినా.. ఇంకా సాధించాల్సింది ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి లేదని.. ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. పీసీసీ అధ్యక్షుడు జిల్లా వాసి అయినప్పటికీ నిజామాబాద్‌కు ఏమీ చేయలేకపోవడం దురదృష్టకరమన్నారు. విద్య, ఉద్యోగం, వైద్యాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం మాత్రమే కాంగ్రెస్ పని చేస్తుందే తప్ప.. వారి కోసం ఏమీ చేయడం లేదని వ్యాఖ్యానించారు.
Kalvakuntla Kavitha | అమరవీరులకు న్యాయం జరగలేదు..
అమరవీరుల కుటుంబాలకు న్యాయం దక్కడం లేదని కవిత అన్నారు. వారికి రూ. కోటి ఇచ్చేవరకు తాను ఉద్యమిస్తానని వెల్లడించారు. అలాగే ఉద్యమకారులకు ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని స్వాతంత్ర సమరయోధుల మాదిరిగా పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు మాధవనగర్ నుంచి జిల్లా కేంద్రంలోని కవిత స్వగృహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సూదం రవిచందర్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ గౌడ్, ఎస్ఏ అలీం తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవిత ‘జనంబాట’ ర్యాలీని వీడియో తీస్తున్న ఆమె మామ రాంకిషన్ రావు

 
 


