అక్షరటుడే, వెబ్‌డెస్క్: PCC Chief | ఆంధ్రప్రదేశ్‌కు నదీ జలాలు అప్పగించింది బీఆర్ ఎస్ పార్టీయేనని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఉనికి ఆరాటపడుతున్నారని, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ఆరు అడుగులు పెరిగాడే తప్ప అర అంగుళం మెదడు పెంచుకోలేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)పై హరీశ్‌రావు చేసిన విమర్శలను మహేశ్‌కుమార్‌గౌడ్ తిప్పికొట్టారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాజీ మంత్రిపై ధ్వజమెత్తారు. హరీశ్‌రావు వాదనలలో పస లేదన్నారు.
PCC Chief | సీఎం చెప్పినా నెత్తికెక్కలే..
హరీశ్‌రావు(Harish Rao) ఏం మాట్లాడుతున్నాడో ఆయనకైనా అర్థమవుతుందా? అని ప్రశ్నించారు. ఢిల్లీ సమావేశంలో ఏం జరిగిందో ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్ పెట్టి మరీ వెల్లడించారు. అయినా కూడా హరీశ్‌రావు మెదడుకు ఎక్కనట్లుందని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు అడ్డగోలు వాదనతో, అర్థం లేని తర్కంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ మీటింగ్‌లో ఏం జరిగిందో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్(Union Minister CR Patil) చెప్పిన తర్వాత కూడా పిచ్చి వాగుడు వాగుతూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. మీటింగ్‌లో ఏయే అంశాలు మాట్లాడారో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంగా చెప్పినా కూడా ఇంకా తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడమేమిటని ప్రశ్నించారు. సీఎం మాట్లాడగానే ఏదో ఒకటి మాట్లాడి తన ఉనికిని చాటు కోవాలన్న తపన తప్ప హరీశ్‌రావుకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదన్నారు.
PCC Chief | సీఎం సవాలుపై స్పందించరెందుకు?
తెలంగాణకు చేసిన నష్టం మీద, నదీజలాల పంపిణీపైన చర్చకు సిద్ధమని సవాల్ విసిరితే ఎందుకు స్పందించలేదని మహేశ్‌కుమార్‌గౌడ్(Mahesh Kumar Goud) ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నాయుడు కేసీఆర్(KCR)కు సవాల్ విసిరారని, దానిపై ఇంతవరకూ స్పందన రాలేదన్నారు. అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనండి లేదా తామే ఫామ్ హౌస్‌కు వచ్చి అక్కడ మాక్ అసెంబ్లీ(Mock Assembly) పెడతాము పాల్గొనండి అని సీఎం సవాల్ చేస్తే అక్కడ నుంచి నోరు లేవలేదన్నారు. మళ్లీ సిగ్గులేకుండా కేటీఆర్ సహా బీఆర్ ఎస్ వాళ్లు సవాళ్ల గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
PCC Chief | నీళ్లు అప్పగించిందే మీరు కదా..
ఆంద్రప్రదేశ్(Andhra Pradesh)కు నీళ్లు అప్పగించిందే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పీసీసీ చీఫ్ విమర్శించారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవు, రాయలసీమను రత్నాల సీమ చేస్తానన్నది ఎవరో హరీశ్‌రావు గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ప్రయోజనాలను కాదని, అప్పటి ఏపీ సీఎం జగన్(YS Jagan)తో కలిసి ఆంధ్ర ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.
‘ఆంధ్ర ప్రాజెక్టులు కట్టుకున్నా సమస్య లేదు. రాయలసీమను రతనాల సీమ చేస్తాను. బెసిన్లు లేవు, భేషజాలు లేవు అని కేసీఆర్ అంటేనే కదా ఈరోజు వాళ్లు బనకచర్ల, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు కడుతున్నది. తెలంగాణకు ద్రోహం చేసి మళ్లీ మీరే సిగ్గులేకుండా కాంగ్రెస్ మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy)పై ఆరోపణలు చేస్తున్నారు. మీకు దమ్ముంటే అసెంబ్లీలో పెట్టే చర్చలకు నువ్వు, మీ మామ కేసీఆర్ వచ్చి మీ వాదన చెప్పండి. అప్పుడు ఎవరు ఏంటో తెలుస్తుంది’ అని సవాల్ చేశారు. ప్రెస్‌మీట్‌లు పెట్టి కోడిగుడ్డు మీద ఈకలు పీకుదామని చూస్తే జనం నమ్మరన్నారు.