అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BRS | భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పూర్తి సందిగ్ధంలో పడిపోయింది. అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా ఎదురవుతున్న సవాళ్లు ఆ పార్టీని సంక్షోభంలోకి నెట్టేశాయి.
పార్టీ అధినేత కేసీఆర్(KCR) కుటుంబంలోనే ఆధిపత్య పోరు, గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, వరుస విచారణలు, చేజారుతున్న ప్రజాప్రతినిధులు, గులాబీ నేతలు చేస్తున్న విపరీత వ్యాఖ్యలు తదితర కారణాలతో బీఆర్ఎస్ తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఇప్పుడు తాజాగా ఆ పార్టీకి ఉప రాష్ట్రపతి ఎన్నిక(Vice President Election) రూపంలో మరో చిక్కు వచ్చి పడింది. ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకోలేక సతమతమవుతోంది. ఎటు వైపు మొగ్గితే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలియక కొట్టుమిట్టాడుతోంది.
BRS | ఎటు వైపో..
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండి కూటమి అభ్యర్థులను రంగంలోకి దించుతున్నాయి. సెప్టెంబర్ 9న జరుగనున్న ఈ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్(Radhakrishnan Nomination) దాఖలు చేశారు. ఇక, ఇండి కూటమి అభ్యర్థి, తెలుగు రాష్ట్రాలకు చెందిన న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి(Justice Sudarshan Reddy) కూడా నామినేషన్‌కు సిద్ధమవుతున్నారు. తెలంగాణకు చెందిన తెలుగు వ్యక్తి, రైతు బిడ్డ అయిన సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏపీ, తెలంగాణకు చెందిన పార్టీలకు పిలుపునిచ్చారు. పీవీ నర్సింహారావు(PV Narasimha Rao) తర్వాత మరో తెలుగు వ్యక్తికి ఉన్నత పదవి రావడానికి సహకరించాలని కోరారు. తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ కూడా సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలతో పాటు వైఎస్సార్ సీపీ కూడా రాధాకృష్ణన్‌కే మద్దతిస్తామని తెలిపాయి. ఇక, బీఆర్ఎస్ ఒక్కటే ఎటు వైపు మొగ్గాలో తేల్చుకోలేక సతమతమవుతోంది.
BRS | ఎటు వెళ్తే ఏమవుతుందో?
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో గులాబీ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎవరికి మద్దతు ఇచ్చినా ప్రత్యర్థులకు మంచి ఆయుధం దొరికినట్లు అవుతుంది. బీజేపీ నిలబెట్టిన సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు ఇస్తే ఆ రెండు పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ మరింత ఉధృతంగా ప్రచారం చేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారానే హస్తం పార్టీ గెలుపును సొంతం చేసుకుంది. ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తే బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తారన్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లవుతుంది. తెలంగాణ సెంటిమెంట్(Telangana Sentiment)తో పుట్టిన బీఆర్ఎస్.. తెలంగాణకు చెందిన వ్యక్తిని ఉన్నత పదవిలో కూర్చోబెట్టే అవకాశాన్ని అడ్డుకుందని విమర్శించడానికి కాంగ్రెస్ కు మరో అవకాశం ఇచ్చినట్లవుతుంది.
ఇక, కాంగ్రెస్ పార్టీ(Congress Party) అభ్యర్థికి మద్దతిస్తే మరో రకంగా గులాబీ పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ ఎస్ ఒక్కటేనని బీజేపీ ఎదురుదాడి చేస్తుంది. అందుకే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) సహా గత ప్రభుత్వ అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు ఎక్కుపెడుతుంది.
BRS | కింకర్తవ్యం..
సెప్టెంబర్ 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు ఓటు వేస్తారు. బీఆర్ ఎస్ పార్టీ(BRS Party)కి లోక్‌సభలో ఎలాంటి ప్రాతినిధ్యం లేదు కానీ, నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఉభయ సభల్లో ఉన్న బలాబలాలను బట్టి ఎన్డీయేకు సంపూర్ణమైన మెజార్టీ ఉంది. అన్ని భాగస్వామ్య పక్షాల సహకారంతో రాధాకృష్ణన్ గెలుపు నల్లేరుపై నడుకే. పోటీ పెట్టడం ద్వారా బీజేపీని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతోనే ఇండి కూటమి అభ్యర్థిని రంగంలోకి దించింది తప్పితే ఏదో గెలుస్తామని కాదు. ఊహించని పరిణామాలు ఎదురైతే తప్ప రాధాకృష్ణన్ విజయం దాదాపు ఖాయమైనట్లే. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసినా, వేయకపోయినా ఫలితమేమీ తారుమారు కాదు. ఎవరో ఒకరి వైపు మొగ్గి ప్రత్యర్థులకు అనవసరంగా అవకాశం కల్పించే బదులు ఎన్నికకు దూరంగా ఉండడమే గులాబీ పార్టీకి శ్రేయస్కరం.