అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PCC Chief | రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. త్వరలో స్థానిక ఎన్నికలు (Local Body Elections) జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు జోరు పెంచాయి. తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ (BRS) నాలుగు ముక్కలు అయిందని ఆయన అన్నారు. కరీంనగర్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఇక బీఆర్‌ఎస్ ఉండదని మహేశ్‌గౌడ్ అన్నారు. మేడిగడ్డతోనే బీఆర్‌ఎస్ మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. ‘పది మంది ఎమ్మెల్యేల సంగతి తర్వాత ముందు మీ కుటుంబ ఆస్తుల పంచాయితీ చూసుకోవాలని’ కేటీఆర్‌కు సూచించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆ పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఇటీవల కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాలుగు ముక్కలు అయిందని వ్యాఖ్యానించారు. కాగా ఎమ్మెల్సీ కవిత పార్టీ నుంచి దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
PCC Chief | పేదల సంక్షేమమే ధ్యేయం
పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని మహేశ్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడానికే జనహిత పాదయాత్ర (Janahita Padayatra) చేపట్టామన్నారు. పాదయాత్రతో బీజేపీ, బీఆర్ఎస్కు కడుపు నొప్పి వస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయో తెలుసుకోవడానికి పాదయాత్ర చేపట్టామన్నారు. అట్టడుగు వర్గాల వారికి సంక్షేమం చేర్చడమే తమ లక్ష్యమన్నారు.
PCC Chief | కార్యకర్తలను వదులుకోం
రాష్ట్రంలో కార్యకర్తల త్యాగాలతోనే కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిందని మహేశ్ గౌడ్ అన్నారు. పార్టీ కోసం ఏళ్లుగా పని చేస్తున్న కార్యకర్తలను వదులుకోమని ఆయన చెప్పారు. కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి అవకాశాలు ఉంటాయన్నారు. అయితే పాత వారికి ముందు అవకాశం వస్తుందని స్పష్టం చేశారు.
PCC Chief | రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది
బీజేపీ (BJP) రాష్ట్రానికి ఏం చేసిందని పీసీసీ అధ్యక్షుడు ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలతోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు పెండింగ్‌లో ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గించలేదని ఆయన ప్రశ్నించారు. 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమన్నారు.