అక్షరటుడే, ఇందూరు: BRS Nizamabad | బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించడం కోసం జరుగుతున్న ఉద్యమంలో బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తామని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు శనివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధికార ప్రధినిధి సుజిత్‌సింగ్ ఠాకూర్ (Sujit Singh Thakur) విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
BRS Nizamabad | బీసీల కోసం కేసీఆర్ కమిట్మెంట్ కొత్తేం కాదు..
ఈ సందర్భంగా పార్టీ నిజామాబాద్ జిల్లా అధికార ప్రతినిధి సుజిత్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. బీసీల కోసం జరుగుతున్న పోరాటంతో తాము బీసీ జేఏసీతో (BC JAC) కలిసి నడుస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల (BC reservations) సాధనలో కేసీఆర్ కమిట్మెంట్ కొత్తేమీ కాదన్నారు. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మా పార్టీ వైఖరిని స్పష్టం చేయడం జరిగిందన్నారు.
BRS Nizamabad | 2004లో ఆర్ కృష్ణయ్యతో ఢిల్లీకి..
2004 డిసెంబర్ 17న బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యతో నాటి ప్రధాని కలిసి బీసీ రిజర్వేషన్లపై చర్చించామని ఆయన గుర్తు చేశారు. ఆనాడు కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ కృష్ణయ్య సమక్షంలో పీఎం ముందు మూడు డిమాండ్లు పెట్టడం జరిగిందన్నారు.
దేశంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, జనాభాకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్లు పీఎం ముందు పెట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశాక.. రాష్ట్రంలో 10 రాజ్యసభ సీట్లు వస్తే 5 సీట్లు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే (KCR) దక్కుతుందన్నారు.
BRS Nizamabad | కాంగ్రెస్‌ను నమ్మితే మోసమే..
బీఆర్ఎస్ బీసీ నాయకుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి గెలిపిస్తే ప్రజలను మోసం చేస్తోందన్నారు. పార్లమెంటులో చేయాల్సిన పనిని శాసనసభలో బిల్లు పెట్టి.. ఆ నెపాన్ని ఇతరులపై తోసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు కేవలం స్థానిక సంస్థల కోసం తెచ్చినదేనని.. ఇవే రిజర్వేషన్లను విద్యలో, ఉపాధిలో కూడా కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ బీసీ ఉద్యమ నాయకులు చింతకాయల రాజు, మాకు రవి, సురేష్, కాళీ చరణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
