అక్షరటుడే, వెబ్డెస్క్ : Municipal elections | రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. దీంతో అన్ని పార్టీలు పురపోరుకు సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా బీఆర్ఎస్ (BRS) మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జీలను నియమించింది.
మున్సిపాలిటీల వారీగా సమన్వయకర్తలను నియమిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ప్రత్యేక సమన్వయకర్తలను నియమించారు. ప్రతి మున్సిపాలిటీ బాధ్యతలను ఒక సీనియర్ నాయకుడికి అప్పగించారు. పార్టీ శ్రేణులను ఏకం చేయడం, స్థానిక రాజకీయాలకు అనుగుణంగా వ్యూహాలను రూపొందించడంలో వీరు కీలక పాత్ర పోషించనున్నారు. ఎన్నికల ప్రారంభం నుంచి ముగిసే వరకు వీరు ఆయా మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉండనున్నారు.
Municipal elections | అభ్యర్థుల ఎంపికలో..
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. అయితే బలమైన నేతలను బరిలో నిలుపాలని పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో టికెట్ల కేటాయింపులో సమన్వయకర్తలు కీలక పాత్ర పోషించనున్నారు. స్థానిక నాయకులతో చర్చించి నివేదికలను పార్టీ అధిష్టానానికి సమర్పిస్తారు. ఎన్నికల సరళిని, గ్రౌండ్ రిపోర్టులను ఎప్పటికప్పుడు తెలంగాణ భవన్లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి, వర్కింగ్ ప్రెసిడెంట్కు నివేదించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ సూచించారు. కాగా కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించాయి. బీఆర్ఎస్ మాత్రం మున్సిపాలిటీల వారీగా నియమించడం గమనార్హం.