అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BRS Hung Municipalities Strategy | మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ సోమవారం నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 34 మున్సిపాలిటీల్లో హంగ్ రాగా.. పలు చోట్ల అధికార కాంగ్రెస్ పీఠాలను కైవసం చేసుకుంది. 11 చోట్ల ఎన్నిక వాయిదా పడింది.
ఎన్నికలు వాయిదా పడిన మున్సిపాలిటీల్లో మున్సిపల్ పీఠం దక్కించుకోవడానికి బీఆర్ఎస్ (BRS) దృష్టి పెట్టింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధిక స్థానాలు గెలిచిన ఎనిమిది పట్టణాలకు సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నియమించారు. కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకుని, ఎన్నిక సాఫీగా నిర్వహించుకోవడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. స్థానిక పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో మాట్టారు. కాంగ్రెస్ అరాచకాలపై పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
BRS Hung Municipalities Strategy | గెలిచే అవకాశం
పలు చోట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లను కాంగ్రెస్ నాయకులు నిర్భందించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలపై కేటీఆర్ ఆరా తీశారు. స్థానిక నాయకత్వానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు పార్టీ తరఫున సీనియర్ నాయకులను ప్రత్యేక ఇన్‌ఛార్జులుగా పంపుతున్నట్లు ప్రకటించారు. వాయిదా పడ్డ మున్సిపాలిటీల్లో మంగళవారం ఎన్నిక నిర్వహించనున్నారు. 8 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఛైర్మన్ పీఠాలను గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో ఆయా మున్సిపాలిటీలకు కేటీఆర్ ఇన్ఛార్జీలను నియమించారు.
BRS Hung Municipalities Strategy | ఇన్ఛార్జీలు వీరే..
తొర్రూర్ (Thorrur)కు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జనగామకు ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, క్యాతనపల్లికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఖానాపూర్‌కు ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఇంద్రేశం ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, కాగజ్ నగర్ మాజీ మంత్రి జోగు రామన్న, జహీరాబాద్‌కు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నంకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును ఇన్ఛార్జీలు నియమించారు.