అక్షరటుడే, వెబ్‌డెస్క్ : High Court | పీసీ ఘోష్ కమిషన్‌ను రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారించిన పీసీ ఘోష్ కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) సోమవారం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.
ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరిపించాలని కోరారు. దీంతో ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన కోర్టు.. ఏం చర్యలు తీసుకుంటారో రేపటిలోగా తెలపాలని సూచించింది. అయితే, ప్రభుత్వం సీబీఐ విచారణకు (CBI Investigation) ఆదేశించిన నేపథ్యంలోగా రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని పిటిషనర్ కోరగా.. కోర్టు అందుకు నిరాకరించింది. రేపటివరకు వేచి చూద్దామని చెబుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది.
High Court | సీబీఐ విచారణ నిలిపి వేయాలని..
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించించాలని శాసనసభ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం అసెంబ్లీ సుదీర్ఘంగా జరిగిన చర్చకు సమాధానమిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డ వారిని సహించేది లేదని, అందుకే సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారించిన పీసీ ఘోష్ కమిషన్‌ను (PC Ghosh Commission) రద్దు చేయాలని హరీశ్‌రావు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు చేపట్టాలని హరీశ్‌రావు తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కమిషన్ విచారణపై అసెంబ్లీలో చర్చించాకే తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కోర్టుకు తెలిపిందని పిటిషనర్ తరఫు న్యాయవాది గుర్తు చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేయకుండానే సీబీఐ విచారణకు ఆదేశించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
High Court | మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరణ
కేసీఆర్, హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టువిచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా వారి తరఫున న్యాయవాదులు సుందరం, శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. సీబీఐ విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయానలి అభ్యర్థించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపిస్తామన్న సీఎం ప్రకటనను ఈ సందర్భంగా ధర్మాసనం (High Court) దృష్టికి తీసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ప్రభుత్వ తరఫు న్యాయవాదికి సూచించింది. అయితే, ఒకటి, రెండ్రోజుల్లో ప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకుని కోర్టుకు చెబుతామని ఆయన తెలపగా, రేపటిలోగా చెప్పాలని సీజే ధర్మాసనం సూచించింది. అయితే, రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించాలన్న హరీశ్‌రావు తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.