అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KCR | ఉప రాష్ట్రపతి ఎన్నిక(Vice President Election) నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న జరుగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. బీఆర్ ఎస్ పార్టీ(BRS Party)కి లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ, రాజ్యసభలో మాత్రం ఉంది.
కేఆర్ సురేశ్‌రెడ్డి, పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదరరావు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఎన్డీయే అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, ఇండి కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి బరిలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వకూడదని కేసీఆర్(KCR) నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
KCR | రెండు పార్టీలకు సమదూరం
బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ కూటములకు దూరంగా ఉంటూ వస్తోంది. 2014లో అధికారం చేపట్టిన కేసీఆర్ ఎన్డీయే ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసుకొచ్చిన బిల్లులకు మద్దతు పలికారు. అయితే, రెండోసారి అధికారంలోకి వచ్చాక మాత్రం ఆయన ఎన్డీయే కూటమికి ఉంటూ వస్తున్నారు.
అంతేకాదు, బీజేపీని తీవ్రంగా విమర్శిస్తూ ఆ పార్టీని ఓడించేందుకు కృషి చేశారు. పైగా తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు యత్నిస్తోందని అప్పట్లో కేసీఆర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. తర్వాతి కాలంలో అదంతా ఉత్తిదేనని తేలిపోయింది. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించిన కేసీఆర్.. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీతోనూ సమదూరం పాటించారు. అటు ఎన్డీయే, ఇటు ఇండి కూటమిలో భాగం కాకుండా స్వతంత్రంగా ఉంటూ వస్తున్నారు.
KCR | విమర్శలకు అవకాశమివ్వకూడదనే..
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకి మద్దతు ప్రకటించినా, అది రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తుందని బీఆర్ఎస్ భావించింది. అందుకే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం చేస్తోంది. ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) బాగా లబ్ధి పొందింది. ఇప్పటికీ అదే ప్రచారం చేస్తూ బీఆర్ఎస్‌ను డిఫెన్స్‌లో పడేస్తోంది.
మరోవైపు, బీజేపీ కూడా రెండు ప్రధాన పార్టీలపై ఎదురుదాడి చేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని, వారి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ప్రచారం చేస్తోంది. పద పదేళ్లలో తీవ్ర అవినీతికి పాల్పడిన కేసీఆర్, కేటీఆర్(KTR)ను అరెస్టు చేయకపోవడమే అందుకు కారణమని గుర్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా మరొకరికి విమర్శించే అవకాశం ఇచ్చినట్లవుతుందన్న భావనతో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.