అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Ramarthi Gopi | కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి అన్నారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో (District Congress Party Office) శనివారం విలేకరులతో మాట్లాడారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతి చేస్తే ప్రజలు వారిని మూలన కూర్చోబెట్టారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించారన్నారు.
Ramarthi Gopi | బీఆర్ఎస్ నాయకులవి అహంకారపూరిత వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ తామే అధికారంలో ఉన్నట్లుగా భావిస్తూ అహంకారంతో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చిందని వాటిని నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలు చెప్పి దాటవేస్తూ వచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తూ ప్రజాదరణ పొందుతోందన్నారు. దీంతో ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు పేలవమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్కడ హరీష్ రావు (Harish rao), కేటీఆర్ (KTR).. జిల్లాలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth reddy) రాష్ట్ర ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
Ramarthi Gopi | గల్ఫ్ బాధితులకు సాయం అందిస్తున్నాం..
ఇటీవల వేల్పూర్ గ్రామంలో గల్ఫ్ బాధిత (Gulf victim) కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితులను ఆదుకోవడం లేదంటూ మాట్లాడరన్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ సెల్‌ను (NRI Cell) ఏర్పాటు చేసి గల్ఫ్ బాధితులకు సాయం చేస్తోందన్నారు. ఎలాగైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కించపర్చాలనే ఆలోచనతో ప్రశాంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు.
Ramarthi Gopi | సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని చెప్పాం..
గల్ఫ్ బాధితులకు అందిస్తున్న సాయంపై సాక్ష్యాధారాలతో సహా నిరూపించేందుకు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ‘కనువిప్పు’ కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 17న వేల్పూర్‌లోని (Velpur) గాంధీ విగ్రహం వద్ద గల్ఫ్ బాధితులకు అందిస్తున్న సాయంపై సాక్ష్యాలతో సహా వస్తామని చెప్పామని స్పష్టం చేశారు.
క్లారిటీ ఇస్తామని చెప్పామే తప్ప దాడి చేసే ఆలోచన కాంగ్రెస్ కార్యకర్తలకు లేదన్నారు. ప్రశాంత్ రెడ్డి ఆరోపణలన్నీ నిరాధారాలని ఆయన చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విక్కీ యాదవ్, యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శోభన్, యువజన కాంగ్రెస్ నగర మాజీ అధ్యక్షులు ప్రీతమ్, అవిన్, వినోద్ కుమార్, నరేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు.