అక్షరటుడే, వెబ్డెస్క్ : Revanth Reddy Allegations | బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు, పెవికాల్ బంధం ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కాంగ్రెస్తో గెలవలేక బీజేపీ వాళ్లను బీఆర్ఎస్ అరువు తెచ్చుకుందన్నారు.
వికారాబాద్ (Vikarabad) జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి శనివారం పర్యటించారు. నారాయణపూర్ బహిరంగ సభలో మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కులు పంపిణీ చేశారు. రెండేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాని మోదీని చూసి ఓటు వేయమని బీజేపీ నేతలు అడుగుతున్నారని చెప్పారు. మోదీని చూసి ఓటు వేస్తే గల్లీలో ఉండే లీడర్ పనిచేయకపోతే అడగగలమా అని ప్రశ్నించారు.
Revanth Reddy Allegations | కడుపు నిండా విషం
గ్రూప్-1 (Group-1) నియామకాలను అడ్డుకునేందుకు కేసీఆర్, కేటీఆర్ తప్పుడు పిటిషన్లు వేశారని రేవంత్రెడ్డి ఆరోపించారు. దళితులు, బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులు గ్రూప్-1 కొలువులు సాధిస్తే కేసీఆర్, కేటీఆర్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. కడుపు నిండా విషం పెట్టుకుని గ్రూప్-1 పరీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు.
Revanth Reddy Allegations | పదేళ్ల దోపిడీ చరిత్ర
కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR), హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉంటే మారీచుడు, సుబాహువులు ఊర్ల మీద పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాపింగ్ లాంటి చిల్లర పనులకు నోటీసులు ఇవ్వక ఏం చేస్తారన్నారు. కేసీఆర్ చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు, కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సీఎం స్పందించారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ దొంగ హామీల చరిత్ర తాను చెరిపితే పోతుందా అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ దోపిడీ చరిత్రను ఎవ్వరూ చెరిపేయలేరని చెప్పారు. తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం పాపాల భైరవుడి చరిత్ర చెరిగిపోదని ఎద్దేవా చేశారు. ఆ చరిత్ర చెరిగిపోకుండా చూసే బాధ్యత తనదని చెప్పారు.