అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం తీవ్ర ఆందోళనకర పరిస్థితి సృష్టించింది. జిల్లా చరిత్రలోనే అత్యధిక వర్షపాతం బుధవారం రోజు కురిసిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. భారీవర్షం జిల్లాను అతలాకుతలం చేసింది.
Kamareddy | గోడకూలి పల్లె దవాఖాన వైద్యుడు మృతి
జిల్లాలో మంగళవారం రాత్రి 3 గంటలకు మొదలైన వాన బుధవారం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఇంతటి భారీ వర్షం జిల్లా చరిత్రలో ఎప్పుడూ చూడలేని పలువురు పేర్కొన్నారు. జిల్లాలో వరద ఉధృతికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మొత్తం రవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజంపేట మండలం గుండారం పల్లె దవాఖాన వైద్యుడు డా. వినయ్ కుమార్ గోడ కూలి మృతి చెందాడు.
Kamareddy | కామారెడ్డి పట్టణంలో..
కామారెడ్డి పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. నిజాంసాగర్ చౌరస్తాలోని (Nizamsagar Cowrastha) లయోల పాఠశాల, విద్యానగర్, రైల్వే బ్రిడ్జి ప్రాంతం, సిరిసిల్ల రోడ్డు (Sirisilla Road) రహదారులు నీటిలో మునిగిపోయాయి. పంచముఖి హనుమాన్ కాలనీలో వాహనాలు నీట మునిగాయి. బతుకమ్మ కుంట కాలనీలో ఇళ్లు నీట మునిగిపోయాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో వాగు ప్రవాహానికి 5 కార్లు కొట్టుకుపోయాయి. భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద ఎడ్లకట్ట వాగు ఉధృతికి 44వ జాతీయ రహదారి నీటిలో చిక్కుకుంది. దాంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా పోలీసులు రహదారిని పూర్తిగా మూసివేశారు.
Kamareddy | వరదలో కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తులు..
దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామం వద్ద ఎడ్ల కట్ట వాగు ప్రవాహంలో కారు చిక్కుకుపోయారు. జేసీబీ సహాయంతో కారులో ఉన్న జేసీబీ సాయంతో కాపాడేలోపు వరద ఉధృతికి వారు కొట్టుకుపోయారు. రాజంపేట (Rajampet) మండలం తలమడ్ల రైల్వే ట్రాక్ కింద నుంచి వరద నీరు ఉధృతంగా పారడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. రాజంపేట మండలం కొండాపూర్ లేత మామిడి తండాలో నీటి ప్రవాహంతో సుమారు 15 కుటుంబాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తమను హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వేడుకున్నారు.
Kamareddy | సాహసం చేసిన పోలీసులు..
కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీలో పారుతున్న వరద ప్రవాహంలో చిక్కుకున్న వృద్ధురాలు, ఓ మహిళ, చిన్నారిని కామారెడ్డి పట్టణ సీఐ నరహరి (CI Narahari), పోలీసు సిబ్బంది రెస్క్యూ చేసి కాపాడారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి ప్రాంతంలో వాగు ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి.
బస్వన్నపల్లి, ఆర్గొండ ప్రాంతాల్లో వరద ఉధృతితో రెస్క్యూ ఆపరేషన్‌కు (Rescue operation) ఆటంకాలు ఎదురయ్యాయి. కామారెడ్డి నియోజకవర్గంతో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో రహదారులు తెగిపోయాయి. గున్కుల్ శివారులో నిజాంసాగర్ మంజీర వాగులో చిక్కుకున్న ఐదుగురుని పోలీసులు సురక్షితంగా రక్షించారు.
Kamareddy | రేపు విద్యాసంస్థలకు సెలవు
జిల్లాలో భారీ వర్షం నేపథ్యంలో జిల్లాలోని విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వరద ప్రాంతాల్లో పర్యటించవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. సహాయం కోసం అధికారులను సంప్రదించాలని సూచించారు.
సంగమేశ్వర్ వాగు వద్ద కారుతో పాటు కొట్టుకుపోతున్న ఇద్దరు వ్యక్తులను కాపాడే ప్రయత్నం చేస్తున్న జేసీబీ
నగరంలోని బతుకమ్మ కుంటలో ఇళ్లలోకి చేరిన వరద
రాజంపేట మండలంలో గోడకూలి మృతి చెందిన వైద్యుడు వినయ్ కుమార్
కామారెడ్డి పట్టణంలో రహదారిని మూసివేసిన పోలీసులు
వరద ఉధృతికి రాజంపేట మండలం తలమడ్ల వద్ద రైల్వేట్రాక్ కింది నుంచి కొట్టుకుపోయిన మట్టి