అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల(Domestic stock markets)లో మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. బుధవారం ప్రధాన సూచీలు లాభాలతో ముగిశాయి. ఉదయం 141 పాయింట్ల లాభంతో ట్రేడింగ్(Trading) ప్రారంభించిన సెన్సెక్స్.. ఇంట్రాడేలో గరిష్టంగా 827 పాయింట్లు లాభపడింది. 61 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty).. ఇంట్రాడేలో గరిష్టంగా 263 పాయింట్లు పెరిగింది. రోజంతా ఒడిదుడుకుల మధ్య కొనసాగినా లాభాల్లోనే ఉంది. చివరికి సెన్సెక్స్(Sensex) 872 పాయింట్ల లాభంతో 81.186 వద్ద, నిఫ్టీ 261 పాయింట్ల లాభంతో 24,683 వద్ద ముగిశాయి. బీఎస్‌ఈలో 2,291 కంపెనీలు లాభపడగా 1,685 స్టాక్స్ మాత్రమే నష్టపోయాయి. 139 కంపెనీలు ఫ్లాట్(Flat)గా ముగిశాయి. 76 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 25 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 5 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ రూ. 2.26 లక్షల కోట్లకుపైగా పెరిగింది.
Stock Markets | అన్ని సెక్టార్లలో..
కన్జూమర్ డ్యూరెబుల్(Consumer durable) మినహా మిగతా అన్ని సెక్టార్లు లాభాల బాటలో పయనించాయి. బీఎస్‌ఈలో క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.65 శాతం పెరగ్గా.. రియాలిటీ(Realty) 1.58 శాతం, టెలికాం 1.2 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్ ఒక శాతం, హెల్త్‌కేర్ 0.93 శాతం లాభపడ్డాయి. ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ సెక్టార్ల స్టాక్స్ రాణించాయి. మిడ్ క్యాప్(Mid cap) ఇండెక్స్ 0.9 శాతం పెరగ్గా.. లార్జ్ క్యాప్ 0.63 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.50 శాతం లాభంతో ముగిశాయి. కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్ 0.64 శాతం పడిపోయింది.
Stock Markets | మార్కెట్లు ఎందుకు పెరిగాయంటే..
వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లు (trading sessions) మన మార్కెట్లు సెల్లాఫ్‌కు గురయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు(Investors) షార్ట్ కవరింగ్ చేసుకున్నట్లు అనలిస్టులు అంచనా వేస్తున్నారు. కనిష్టాల వద్ద కొనుగోళ్లకు పాల్పడడంతో సూచీలు పెరిగాయి.డాలర్ విలువ బలహీనపడుతోంది. డాలర్ ఇండెక్స్(Dollar index) మరోసారి వంద లోపలికి వచ్చింది. డాలర్ బలహీనపడడం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఊరటనిచ్చే అంశం. ఇది మన మార్కెట్లలో ఎఫ్‌ఐఐల ఇన్‌ఫ్లోలు పెరగడానికి దోహదపడుతుంది.
మన కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి ఉంటున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం తగ్గుతుండడంతో ఆర్‌బీఐ (RBI) మరోసారి వడ్డీ రేట్లను (intrest rates) తగ్గించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జీడీపీ(GDP) వృద్ధి రేటు కూడా 6.5 శాతంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉంటుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతున్నారు.
Stock Markets | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 30 ఇండెక్స్‌లో 24 కంపెనీలు లాభపడగా.. 6 కంపెనీలు మాత్రమే నష్టపోయాయి. బజాజ్ ఫిన్‌సర్వ్(Bajaj finserv) 2.02 శాతం పెరగ్గా.. టాటా స్టీల్ 1.86 శాతం, సన్‌ఫార్మా 1.57 శాతం, టెక్ మహీంద్రా 1.39 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.36 శాతం పెరిగాయి. నెస్లే, టాటా మోటార్స్, ఎన్టీపీసీ(NTPC) ఒక శాతానికిపైగా లాభపడ్డాయి.
Stock Markets | Top losers..
ఇండస్ ఇండ్ బ్యాంక్(Indusind bank) 1.39 శాతం నష్టపోగా కొటక్ బ్యాంక్, పవర్ గ్రిడ్ అర శాతానికిపైగా నష్టంతో ముగిశాయి.