అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirumala | తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారు తిరుమలలో చిన్నశేష వాహనంపై దర్శనం ఇచ్చారు.
తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి రోజు స్వామి వారికి పెద్ద శేష వాహన సేవ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Nayudu) తొలిరోజు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. గురువారం మలయప్పస్వామి ఐదు తలల శేష వాహనంపై దర్శనమిచ్చారు. వాహన సేవలను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చారు. ఈ రోజు సాయంత్రం హంసవాహన సేవ నిర్వహించనున్నారు.
Tirumala | ఉపరాష్ట్రపతి పూజలు
శ్రీవారిని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (Vice President CP Radhakrishnan), సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం దర్శించుకున్నారు. వారికి ఆలయ మహాద్వారం వద్ద వేద పండితులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వారికి ప్రసాదాలను అందజేశారు.
Tirumala | వసతి సముదాయం ప్రారంభం
తిరుమలలో భక్తుల కోసం మరో అత్యాధునిక వసతి సముదాయాన్ని (పీఏసీ-5) ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు ప్రారంభించారు. వేంకటాద్రి నిలయం వద్ద కొత్తగా దీనిని నిర్మించారు. బుకింగ్ లేకున్నా భక్తులకు వసతి కల్పించేలా రూ.102 కోట్లతో కాంప్లెక్స్ నిర్మించారు. ఈ సముదాయంలో ఓకేసారి 4 వేల మందికి వసతి సౌకర్యం కల్పించవచ్చు. 2,400 లాకర్లు, 16 డార్మిటరీలు ఇందులో ఉన్నాయి. దీంతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్, లడ్డూ నాణ్యత పరీక్షించే యంత్రాన్ని వారు ప్రారంభించారు.
