అక్షరటుడే, వెబ్డెస్క్ : Penukonda | ఎంతో సంతోషంగా పండుగ చేసుకుందామని అనుకున్న ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూజలు చేద్దామని ఏర్పాట్లు చేసుకున్న ఆ దంపతులకు తీరని శోకం మిగిలింది. వేరుశనగ కాయ గొంతులో ఇరుక్కొని రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని సత్యసాయి జిల్లా పెనుకొండలో చోటు చేసుకుంది.
పెనుకొండ పరిధిలోని వెంకటరెడ్డిపల్లికి చెెందిన నాగరాజు, జ్యోతి దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వరలక్ష్మి వ్రతం (Varalakshmi Vratham) సందర్భంగా శుక్రవారం ఇంట్లో పూజలు చేయడానికి కుటుంబం ఏర్పాట్లు చేసింది.
కుటుంబ సభ్యులు అందరు పిండి వంటలు తయారు చేస్తున్నారు. వేరశనగ కాయలు వేయించి పక్కన పెట్టారు. ఇంతలో నాగరాజు చిన్న కుమారుడు దీపక్ (2) అక్కడకు వచ్చి వేరుసెనగ గింజలు తినడానికి యత్నించాడు. అయితే అవి గొంతులో ఇరుక్కున్నాయి. వెంటనే కుటుంబ సభ్యులు పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
