అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Border Fence Glass Bottles | దేశ సరిహద్దు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తుపాకులు, కంచెలు, సైనికుల కఠిన భద్రత. అయితే బార్డర్ ఫెన్సింగ్‌ను జాగ్రత్తగా గమనిస్తే అక్కడక్కడ ఖాళీ గాజు సీసాలు వేలాడుతూ కనిపిస్తాయి.
సాధారణంగా చూస్తే ఇవి వింతగా అనిపించినా, శత్రు చొరబాట్లను అడ్డుకోవడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని భద్రతా నిపుణులు చెబుతున్నారు. బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (Border Security Force) అమలు చేస్తున్న అత్యంత ప్రభావవంతమైన ‘లో-టెక్’ భద్రతా వ్యూహాల్లో ఇది ఒకటి.
Border Fence Glass Bottles | శబ్దమే సైనికులకు అలారం
సరిహద్దు ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగా ఉండవు. ముఖ్యంగా పంజాబ్, జమ్మూ-కాశ్మీర్ ప్రాంతాల్లో శీతాకాలంలో దట్టమైన పొగమంచు కురుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎదురుగా ఉన్న మనిషే కనిపించని పరిస్థితులు నెలకొంటాయి. అటువంటి సమయాల్లో అత్యాధునిక కెమెరాలు, మోషన్ సెన్సార్లు (Motion Sensors) కూడా సరిగ్గా పనిచేయకపోవచ్చు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గాజు సీసాలే జవాన్లకు ‘సైరన్’లా పని చేస్తాయి.ఎవరైనా చొరబాటుదారులు కంచెను తాకినా, కత్తిరించడానికి ప్రయత్నించినా సీసాలు ఒకదానికొకటి తగిలి “కిణ కిణ”మనే శబ్దం చేస్తాయి. ఈ చిన్న శబ్దమే సైనికులకు అప్రమత్త సంకేతంగా మారి క్షణాల్లో చర్యలు చేపట్టేలా చేస్తుంది.
ఈ గాజు సీసాల వినియోగం వెనుక పలు ప్రయోజనాలు ఉన్నాయి. వీటికి విద్యుత్, బ్యాటరీల అవసరం లేదు. గాలి వీస్తే శబ్దం రాకుండా ప్రత్యేకంగా అమర్చుతారు. కేవలం ఎవరో తాకినప్పుడే శబ్దం వచ్చేలా డిజైన్ చేస్తారు. రాత్రివేళ టార్చ్ లైట్ లేదా వాహనాల హెడ్లైట్లు పడితే సీసాలు కాంతిని ప్రతిఫలింపజేస్తాయి. దీంతో కంచెలో ఏవైనా మార్పులు జరిగితే సులభంగా గుర్తించవచ్చు. చిన్న శబ్దం వచ్చినా తాము పట్టుబడతామనే భయం చొరబాటుదారుల్లో కలుగుతుంది. ఇది మానసిక అడ్డంకిగా పనిచేస్తుంది.
నేటి ఆధునిక కాలంలో లేజర్ వాల్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు (Thermal Imaging Cameras), డ్రోన్లు వంటి అత్యాధునిక భద్రతా పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ, గాజు సీసాల వంటి సంప్రదాయ పద్ధతిని సైనికులు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. కారణం ఇది చాలా సులభం. టెక్నాలజీ ఎప్పుడైనా విఫలమయ్యే అవకాశం ఉన్నా, ఈ సాధారణ పద్ధతి మాత్రం ఎలాంటి వైఫల్యానికీ గురికాదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ భద్రత అందించే ఈ విధానం సరిహద్దు భద్రతలో ఇప్పటికీ విశ్వసనీయ సాధనంగా నిలుస్తోంది.