అక్షరటుడే, వెబ్డెస్క్: Boney Kapoor | ఇండియన్ సినిమా చరిత్రను మార్చిన చిత్రం ‘బాహుబలి’, దాని సీక్వెల్ గా వచ్చిన ‘బాహుబలి 2’ (Baahubali 2) ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ గొప్ప ప్రాజెక్టులో, రమ్యకృష్ణ (Ramyakrishna) పోషించిన ‘రాజమాత శివగామి’ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అయితే మొదట ఆ పాత్ర కోసం అతిలోక సుందరి శ్రీదేవిను (Sridevi) తీసుకోవాలనుకున్నారన్న విషయం ఈ మధ్యకాలంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ విషయంపై శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో ఆయన దర్శకుడు రాజమౌళిపై కాదు, నిర్మాతలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Boney Kapoor | సంచలన కామెంట్స్..
ఈ పాత్ర కోసం రాజమౌళి (Rajamouli) మా ఇంటికి వచ్చి స్వయంగా కథ వినిపించారు. ఆయనలోని డెడికేషన్ చూసి శ్రీదేవి ఎంతో ముచ్చటపడింది. ఆమె ఈ సినిమాలో నటించాలన్న ఉత్సాహంతో ఉన్నప్పుడు, నిర్మాతల వల్లే విషయంలో చీలిక ఏర్పడింది,” అని బోనీ కపూర్ (Boney Kapoor) వెల్లడించారు. “ఆ సమయంలో శ్రీదేవి ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ లాంటి ప్రెస్టీజియస్ సినిమా చేసింది. ఆ సినిమాకి భారీ రెమ్యునరేషన్ ఇచ్చారు. కాని బాహుబలి నిర్మాతలు (Baahubali Producer) మాత్రం అప్పుడు ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ కన్నా తక్కువగా ఆఫర్ చేశారు. ఈ సినిమాలో ఆమె ఉంటే, ఉత్తర భారతంలో భారీ హైప్ వస్తుందని తెలిసినా, కూడా తక్కువ మొత్తం ఇస్తామని చెప్పారు.
ఇక హోటల్‌లో ఒక ఫ్లోర్ అడిగిన మాట నిజమే. కానీ అది డిమాండ్ కాదు. మా పిల్లలు చిన్నవాళ్లు, వారితో సమయం గడిపేందుకు ప్రైవసీ అవసరం. అలాగే, స్కూల్ హాలిడేస్ సమయంలో పెద్ద షెడ్యూల్స్ ప్లాన్ చేయొద్దన్నదే మా అభ్యర్థన. కానీ ఈ మాటలని వారు రివర్స్ గా చెప్పారు. శోభు యార్లగడ్డ ఎక్కువ ఖర్చు చేయడం ఇష్టపడరు. ఆయనే శ్రీదేవిపై తప్పుడు మాటలు చెప్పి, రాజమౌళిని తప్పుదోవ పట్టించాడు.
‘శ్రీదేవి గొంతెమ్మ కోర్కెలు కోరిందంటూ’ రూమర్లు పుట్టించారు. ఆ వాదనలు పూర్తిగా అసత్యం,” అంటూ బోనీ కపూర్ అసహనం వ్యక్తం చేశారు. గతంలో శ్రీదేవి కూడా ఇదే వివాదంపై స్పందిస్తూ,“నేను ఎప్పుడూ నిర్మాతల్ని ఇబ్బంది పెట్టే కోరికలు కోరలేదు. నాపై చేసిన తప్పుడు వ్యాఖ్యలు బాధించాయి. నేను అలా చేస్తే ఈ స్థాయికి వచ్చే దానిని కాదు ” అని వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై తాజాగా బోనీ కపూర్ (Boney Kapoor) చేసిన వ్యాఖ్యలు సినిమా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.