అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Afghanistan | ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం బాంబులతో దద్దరిల్లింది. అయితే, దాడులు ఎవరు చేశారన్నది స్పష్టంగా తెలియక పోయినప్పటికీ పాకిస్తాన్ ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది.
తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) చీఫ్ నూర్ వలీ మెహ్సూద్‌ను అంతమొందించడానికి పాకిస్తాన్ వైమానిక దళం కాబూల్(Kabul)పై దాడి చేసింది. గురువారం అర్ధరాత్రి తర్వాత రెండు భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఎంత మంది చనిపోయారన్నది ఇంకా వెల్లడి కాలేదు. ఆఫ్ఘన్ భూభాగం నుంచి సరిహద్దు ఉగ్రవాద దాడులను ఇకపై సహించబోమని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఆపరేషన్ చోటు చేసుకుంది.
Afghanistan | భారత్ పర్యటనలో అఫ్ఘాన్ మంత్రి..
అఫ్ఘానిస్తాన్ మంత్రి(Afghanistan Minister) భారత్‌లో పర్యటిస్తున్న తరుణంలో చోటు చేసుకున్న బాంబు దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్‌తో ఆర్థిక సంబంధాలను పెంచుకునే లక్ష్యంతో చర్చల కోసం ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారతదేశానికి చేరుకున్న సమయంలో కాబూల్‌లో పేలుళ్లు సంభవించాయి. 2021లో అధికారం చేజిక్కించుకున్న తర్వాత తాలిబన్ నాయకుడు భారతదేశానికి చేసిన మొదటి పర్యటన ఇది.
Afghanistan | పాకిస్తాన్ పాత్ర
కాగా, సరిహద్దు వివాదం కారణంగా తాలిబన్-పాకిస్తాన్(Taliban-Pakistan) ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నందున ఈ పేలుళ్లలో పాకిస్తాన్ పాత్ర ఉందని భావిస్తున్నారు. ఇటీవల, సరిహద్దులో తాలిబన్-పాకిస్తాన్ సైన్యం మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ఆసిఫ్ “ఇనఫ్ ఈజ్ ఈజ్ ఈజ్” అని అన్నారు, ఇస్లామాబాద్ ఇకపై ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాదం కోసం ఉపయోగించడాన్ని సహించదని హెచ్చరించారు. ఒరాక్జాయ్ జిల్లాలో నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థతో జరిగిన కాల్పుల్లో లెఫ్టినెంట్ కల్నల్ మరియు మేజర్‌తో సహా 11 మంది పాకిస్తాన్ భద్రతా సిబ్బంది మరణించిన తర్వాత ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ హెచ్చరిక వచ్చింది. ఉగ్రవాదాన్ని ఎగదోసే వారు ఎక్కడ ఉన్నా పాకిస్తాన్ వెంటాడుతుందని ఆసిఫ్ హెచ్చరించారు. “మా సహనానికి పరిమితులు ఉన్నాయి. పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్‌లో అయినా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేవారు లేదా సహాయం చేసేవారు – పరిణామాలను ఎదుర్కొంటారు” అని ఆయన చెప్పిన గంటల వ్యవధిలోనే కాబూల్‌లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి.
Afghanistan | పేలుళ్లపై దర్యాప్తు..
కాబూల్‌లోని అబ్దుల్ హక్ స్క్వేర్(Abdul Haq Square) సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ఘటన తర్వాత అబ్దుల్ హక్ కూడలి మూసివేయబడిందని, దీనివల్ల ఆ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడిందని స్థానికులు తెలిపారు. “కాబూల్ నగరంలో పేలుడు శబ్దం వినిపించింది. అయితే, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అంతా బాగానే ఉంది, సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది, ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరిగినట్లు నివేదిక ఇవ్వలేదని” అఫ్ఘన్ తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ Xలో తెలిపారు.