అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bomb Threats | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని మూడు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో నకిలీ బెదిరింపులుగా గుర్తించారు.
దేశంలో బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఎయిర్‌పోర్టులు, ఫ్లైట్లు, రైల్వే స్టేషన్లు, కోర్టులు, పాఠశాలలకు ఇటీవల బాంబు బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి. అయితే వీటిలో చాలా వరకు నకిలీ బెదిరింపులు ఉంటున్నాయి. తాజాగా ఏపీలోని అనంతపురం, చిత్తూరు, ఏలూరు కోర్టు (Eluru Court)లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
Bomb Threats | కోర్టును ఖాళీ చేయించి
చిత్తూరు కోర్టు (Chittoor Court) ఆవరణలోని ఓ కారులో బాంబు పెట్టినట్లు ఈ మెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే తనిఖీలు చేపట్టారు. కోర్టులోని సిబ్బంది, న్యాయవాదులను బయటకు పంపించారు. అనంతరం బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. అయితే వారికి ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. అలాగే అనంతపురం కోర్టుకు సైతం బెదిరింపు వచ్చింది. ఆత్మాహుతి దాడి జరుగుతుందని ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో పోలీసులు సోదాలు చేపట్టారు. అనంతపురం కోర్టు (Anantapur Court)కు కూడా బెదిరింపు వచ్చింది. దీంతో అక్కడ కూడా తనిఖీలు చేపట్టిన అధికారులు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో ఇవి నకిలీ బెదిరింపులుగా గుర్తించారు. అయితే ఒకే రోజు మూడు కోర్టులకు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు.