అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bomb Threat | హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో గల సీబీఐ కోర్టుకు (CBI Court) బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కోర్టులో తనిఖీలు చేపట్టారు.
కోర్టు ఆవరణలో బాంబు పెట్టినట్లు మెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు కోర్టు సిబ్బంది, న్యాయవాదులను బయటకు పంపించారు. డాగ్ స్క్వాడ్ (Dog Squad), బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపులతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కాగా.. దేశంలోని పలు కోర్టులకు గతంలోనూ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ, ముంబై కోర్టుల్లో బాంబు పెట్టినట్లు దుండగులు మెయిల్స్ పంపారు. అయితే బాంబు బెదిరింపుల్లో దాదాపు 99 శాతం నకిలీవి ఉంటున్నాయి. గతంలో హన్మకొండ కోర్టుకు ఇలాంటి బాంబు బెదిరింపులు రాగా.. తనిఖీలు చేపట్టిన పోలీసులకు డిటొనేటర్లు లభ్యం అయ్యాయి.
Bomb Threat | వరుస బెదిరింపులతో కలవరం
హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఇటీవల బాంబు బెదిరింపులు పెరిగాయి. ముఖ్యంగా ఢిల్లీలో కారు బాంబు పేలిన తర్వాత ఇలాంటి మెయిళ్లు అధికం అవడం గమనార్హం. శంషాబాద్ ఎయిర్‌పోర్టుతో (Shamshabad Airport) పాటు పలు విమానాలకు నిత్యం బెదిరింపులు వస్తున్నాయి. దీంతో విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేసి తనిఖీలు చేస్తున్నారు. తీరా తనిఖీలు చేస్తే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించడం లేదు. దీంతో ప్రయాణికులు, అధికారుల సమయం వృథా అవుతోంది.